భూమిపై అందరికి ఆ రోగాలు ఇందుకే వస్తున్నాయి: డబ్ల్యూహెచ్ఓ
మనిషికి కొత్త కొత్త రోగాలు ఎందుకొస్తున్నాయి?! WHO says 99% of world's population breathes poor-quality air.
దిశ, వెబ్‌డెస్క్ః 'మనిషికి కొత్త కొత్త రోగాలు ఎందుకొస్తున్నాయి?!' ఇది అందరూ ఆలోచించే ప్రశ్న. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ కూడా చాలా పెరుగుతోంది. దీనితో పాటు మనిషి సౌకర్యాన్ని ఏమాత్రం వదులుకోలేదు. బయటకెళ్లాలంటే కారు, ఇంట్లో ఉంటే ఏసీ.. కొవ్వు కరిగించుకోడానికి వెళ్లే జిమ్ కూడా చల్లగానే ఉండాలి. ఇలా, ఒంటికి వేడి తగలకూడదని చుట్టూ ఉన్న వాతావరణాన్ని నిప్పుల కొలిమి చేసుకుంటున్నాడు మానవుడు. అయితే, ఈ కాలుష్యం కాష్టానికి తీసుకెళ్తుందని మరిచిపోతున్నారు. ఇది ఎవరో ఓ వ్యక్తి అంటుంది కాదు.. సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిక. ప్రపంచంలో దాదాపు అందరూ నాణ్యత లేని గాలి పీల్చుకుంటున్నట్లు తాజాగా ఓ నివేదికను వెల్లడించారు. శిలాజ-ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి మరింత చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే, ఇది శ్వాసకోశ, రక్త-ప్రసరణ సమస్యలకు కారణమయ్యే కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ మరణాలకి దారి తీస్తుంది.
గాలి నాణ్యతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను కఠినతరం చేసిన సుమారు ఆరు నెలల తర్వాత, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నగరాలు, పట్టణాలు, గ్రామాల నుండి సమాచారం సేకరించి, వాటి ఆధారంగా గాలి నాణ్యతపై సరికొత్త నివేదిక ప్రకటించింది. దీనిని బట్టి ప్రపంచ జనాభాలో 99% మంది గాలి-నాణ్యతా పరిమితులను మించిన చెడు గాలిని పీల్చుకుంటున్నారని, ఆ గాలి ఊపిరితిత్తులలోకి లోతుగా చొచ్చుకుపోయి, సిరలు, ధమనులలోకి ప్రవేశించి, వ్యాధికారక కణాలకు దారితీస్తుందని WHO తెలిపింది. తూర్పు మధ్యధరా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉందని, ఆఫ్రికా వీటి తర్వాతి స్థానంలో ఉందని తెలియజేసింది.
వ్యాధికారకమైన నైట్రోజన్ డయాక్సైడ్ ప్రధానంగా ఆటోమొబైల్ ట్రాఫిక్ వంటి మానవ-ఉత్పత్తి ఇంధనాన్ని కాల్చడం నుండి వస్తుందని, ఈ కాలుష్యం పట్టణ ప్రాంతాల్లో సర్వసాధారణమయ్యిందని నివేదికి చెబుతోంది. ఈ కాలుష్యం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు, దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలే కాకుండా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని WHO తెలిపింది. భారతదేశం PM10 స్థాయిలను కలిగి ఉండగా, చైనాలో PM2.5 అధిక స్థాయిలున్నాయి. ముఖ్యంగా PM2.5, ఊపిరితిత్తులలోకి లోతుగా చొచ్చుకుపోయి రక్తప్రవాహంలోకి ప్రవేశించగలదు. దీనివల్ల గుండె రక్తనాళాల సమస్య, సెరెబ్రోవాస్కులర్ (స్ట్రోక్), శ్వాసకోశ ప్రభావాలకు లోనవుతున్నారని WHO తెలిపింది. ఈ పర్టిక్యులేట్ పదార్థం ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుందని, ఇతర వ్యాధులకు కూడా కారణమవుతుందని ప్రస్తుతం ఆధారాలు ఉన్నాయి.
ఇక, వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి భారతదేశం పూనుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలు వాడటం; శిలాజ ఇంధనాలను ఆపేయడం; గ్రీన్ ఎనర్జీని పెంచుకోవడం, గృహ వ్యర్థాలను వేరు చేయడం వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని ఈ సందర్భంగా న్యూ ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌లోని వాయు కాలుష్య నిపుణురాలు అనుమితా రాయ్‌చౌదరి చెప్పారు.