సెలబ్రిటీల చావులను తట్టుకోలేకపోతున్న నెటిజన్స్.. కారణం అదేనా ?
దిశ, ఫీచర్స్ : బంధువు, స్నేహితుడు లేదా పరిచయస్తులను కోల్పోయినప్పటి కంటే ఒక సెలబ్రిటీ మరణం అమితంగా ప్రభావం చూపిస్తుంది. వారితో పరిచయం లేనప్పటికీ ఈ లోకాన్ని విడిచి వెళ్లారన్న వార్త ఒకలాంటి అచేతన స్థితిని కలిగిస్తుంది..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : బంధువు, స్నేహితుడు లేదా పరిచయస్తులను కోల్పోయినప్పటి కంటే ఒక సెలబ్రిటీ మరణం అమితంగా ప్రభావం చూపిస్తుంది. వారితో పరిచయం లేనప్పటికీ ఈ లోకాన్ని విడిచి వెళ్లారన్న వార్త ఒకలాంటి అచేతన స్థితిని కలిగిస్తుంది. కళారంగంలోని ప్రముఖుల శక్తి, కళలో దాగున్న కళాత్మకత.. ఇతరుల జీవితాలపై చూపించే ప్రభావం అలాంటిది. ఈ మధ్య గాయకుడు కేకే ఆకస్మిక మరణం.. కోట్లాది హృదయాల్లో శూన్యత మిగిల్చింది. అతనికి నివాళులర్పిస్తుండగా తోటి కళాకారుల కన్నీటి ధారలే అందుకు సాక్ష్యం. ఈ ఏడాది మొదట్లో 'డిస్కో కింగ్' బప్పి లాహిరి మరణించినప్పుడు 'శోకం ఒక వేడుక' అని రాసిన ఒక స్నేహితుడి మాట.. సెలబ్రిటీ మరణంతో సాధారణ వ్యక్తులు వ్యవహరించే విధానాన్ని పంచుకుంది. అసలు ప్రముఖుల చావులు ఎందుకు వ్యక్తిగతంగా అనిపిస్తాయి? దు:ఖాన్ని ఎదుర్కోవడం గురించి మానసిక నిపుణులు ఏం చెబుతున్నారు?
నిజానికి ఈ ఏడాది చాలా మంది సెలబ్రిటీలు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అర్మాన్ మాలిక్ చెప్పినట్లుగా 2022 'భారతీయ సంగీతానికి బ్లాక్ ఇయర్'. భారతదేశపు గానకోకిల లతా మంగేష్కర్ మరణం తర్వాత బప్పి దా, ఆపై సంతూర్ మాస్ట్రో శివ కుమార్ శర్మ తదితరులు మరణించారు. రీసెంట్‌గా పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురికాగా, పాపులర్ సింగర్ కేకేను గుండెపోటుతో కోల్పోయాం. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు చనిపోయినప్పుడు మనం ఎందుకు అంతగా చలించిపోతామన్న భావనకు నిపుణులు కొన్ని సమాధానాలు ఇచ్చారు. ఫిల్మ్ స్టార్, సింగర్, డ్యాన్సర్, స్పోర్ట్స్ స్టార్ లేదా పొలిటీషియన్స్‌గా ఉన్న సెలబ్రిటీలపై సామాన్య ప్రజానీకం ఏర్పరచుకునే అనుబంధమే ఇలా స్పందించేందుకు కారణమని వివరించారు. పైగా ఇలాంటి సంఘటనలు జనాలను కదిలిస్తాయని, జీవితం గురించిన కఠిన వాస్తవికతను మేల్కొలుపుతాయని చెబుతున్నారు. అంతేకాదు మనిషి అనుభవించే ప్రతీ క్షణాన్ని చివరి క్షణంగా జీవించేందుకు ఇదొక రిమైండర్ వంటిదని స్పష్టం చేస్తున్నారు.
మనకు ఎందుకు బాధ?
ఒక సెలబ్రిటీతో పాటు అతని పని స్వభావం అనేది వారు మరణించాక ప్రజలపై చూపే ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సమీర్ పారిఖ్ వెల్లడించారు. దుఃఖం కేవలం అనుబంధానికి సంబంధించినదని, అందుకే ఇది వ్యక్తిగతంగా అనిపిస్తుందన్నారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయినప్పుడు కలిగే అనుభూతిని పోలి ఉంటుంది. ఎందుకంటే ఇది జ్ఞాపకాలు, క్షణాల(సినిమాలు, పాటలు, మ్యాచ్‌లు లేదా మైలురాళ్లకు సంబంధించినది)కు సంబంధించిన నష్టం. క్లినికల్ సైకాలజిస్ట్, సైకోథెరపిస్ట్ నరేంద్ర కింగర్ ప్రకారం.. ప్రజలు తమను తాము సెలబ్రిటీల జీవితాల్లో ఐడెంటిఫై చేసుకోవడం వల్లే మనసుకు దగ్గరగా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది. అందుకే ఒక సెలబ్రిటీ చనిపోయినప్పుడు మన సన్నిహితులే చనిపోయినట్లుగా భావించి బాధపడతాం.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ నటులు రాజేష్ ఖన్నా, శ్రీదేవి, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ మరణించినప్పుడు చాలా మంది ఇలాంటి భావనే అనుభవించారు. వరల్డ్ వైడ్ సెలబ్రిటీల విషయంలో.. ప్రిన్సెస్ డయానా, సింగింగ్ స్టార్స్ మైఖేల్ జాక్సన్, అమీ వైన్‌హౌస్, బాస్కెట్‌బాల్ స్టార్ కోబ్ బ్రయంట్‌తో పాటు ఇటీవలే మాజీ క్రికెటర్లు షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్ మరణం కూడా అభిమానులను తీవ్రంగా కలచివేసింది.
సంతాపం వెనుకున్న సైకాలజీ?
చనిపోయిన వారి గురించి మీడియా సంచలన కథనాలు, సోషల్ మీడియా హైప్, 24 గంటల 'బ్రేకింగ్ న్యూస్'.. వారితో మరింత అనుబంధాన్ని ప్రేరేపిస్తాయి. ఆ సమయంలో అనుబంధం లోతుగా అనిపిస్తుంది. నిజానికి సామాన్య వ్యక్తుల సొంత జీవితాల్లో ఉండే విసుగు, రొటీన్ యాక్టివిటీ అనేది ఇలాంటి పరిస్థితికి చలించడం సర్వసాధారణం. అయితే ఇలాంటి సంఘటనలకు ప్రభావం చెందడం కంటే తమ సొంత జీవిత అనుభవాల నుంచే ఎక్కువ ప్రేరణ పొందాలని, వాస్తవికతను తెలుసుకోవాలని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు సెలబ్రిటీల మరణాన్ని తట్టుకోలేని అభిమానుల ప్రతిస్పందన విపరీత పరిస్థితులకు దారితీస్తుంది. మరణ వార్త విని గుండెపోటుకు గురవడం లేదా ఆ వార్తను జీర్ణించుకోలేక స్వీయ దహన ప్రయత్నాలు లేదా ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రీసెంట్‌గా సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత 19 ఏళ్ల అభిమాని ఫినైల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
మరణించిన తీరు స్పందించే విధానాన్ని ప్రభావితం చేస్తుందా?
సెలబ్రిటీ మరణించిన తీరు కూడా కూడా ప్రజలు ప్రతిస్పందించే విధానంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్తపై అవిశ్వాసం, షాక్‌తో పాటు మరో నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో చనిపోవడం కూడా జనాల్లో అలాంటి సిచ్యవేషన్‌నే కలిగించింది. కాగా మరణ స్వభావం అనేది సెలబ్రిటీని అభిమానించే వ్యక్తిలో విభిన్నమైన ఆలోచన ప్రక్రియను కలిగిస్తుందని డాక్టర్ పారిఖ్ అంగీకరించారు. ఇక దుఃఖం అనేది ఆయా సెలబ్రిటీలతో వారి అనుబంధం మీద ఆధారపడి అనుభూతి చెందే భావోద్వేగమని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు పాత తరం వ్యక్తి.. సిద్ధూ మూసేవాలా హత్యను పట్టించుకోకున్నా బప్పి లాహిరి కోసం బాధపడవచ్చు. కానీ 28 ఏళ్ల పంజాబీ ఐకాన్ బుల్లెట్ల దాడితో మరణించిన తీరు పట్ల ఎవరికైనా కొంత ఆందోళన, సానుభూతి ఉండవచ్చు.
ఎలా అధిగమించాలి?
సెలబ్రిటీ మరణం కలిగించే దుఃఖాన్ని తట్టుకునే విషయంలో సూచనలు ఏం లేవు. పైన చెప్పినట్లు 'శోకం ఒక వేడుక' అని డాక్టర్ పారిఖ్ అంగీకరిస్తాడు. ఒక సెలబ్రిటీ పోయిన బాధను తగ్గించుకునేందుకు.. మీ బాధను గుర్తించగలిగే వ్యక్తులతో మాట్లాడటం ఉత్తమ మార్గం. ఆ విధంగా ఆయా సెలబ్రిటీలు మీ జీవితాలను స్పృశించిన జ్ఞాపకాలు, క్షణాలను గుర్తుచేసుకోవడమే.