కేబినెట్ విస్తరణ వాయిదా.. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4న.. Latest Telugu News..

Update: 2022-03-26 07:26 GMT

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఏప్రిల్ 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మారుస్తానని ప్రమాణ స్వీకారం చేసిన నాడే సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఉన్న కేబినెట్ మంత్రులు కాస్త సమయం కోరడంతో అది కాస్త మూడేళ్లకు వాయిదా పడింది. అయితే ఇటీవేల సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిపారు.

ఈనెల 27న మంత్రివర్గం రాజీనామా చేస్తుందని ఉగాదినాడు కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా ఏప్రిల్ 11న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఏప్రిల్ 1న అమావాస్య కావడంతో ఆ తర్వాతి రోజున ఉగాది, అనంతరం ఆదివారం కావడంతో విస్తరణపై చర్చించే అవకాశం ఉండదని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించారు. అయితే కొందరు మంత్రులను కొనసాగిస్తానని ప్రకటించేశారు. గతంలో 100 శాతం మంత్రులను మార్చేస్తారంటూ వార్తలు వినిపించాయి. ఈసారి మంత్రివర్గ విస్తరణ కాదని పునర్వ్యవస్థీకరణేనంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే వీటన్నింటిని పటాపంచలు చేస్తూ సీఎం జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. 100 శాతం మంత్రివర్గం మార్చడం లేదని కొందరు మంత్రులు ఉంటారని తేల్చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ ఇచ్చేశారు. మంత్రి పదవి నుంచి తప్పించిన వాళ్లు పార్టీ కోసం పని చేయాలని దిశానిర్దేశం చేశారు. మంత్రి పదవులు కోల్పోయిన వారు రెస్ట్ మోడ్‌లోకి వెళ్లొద్దని పార్టీ కోసం శ్రమించాలంటూ హితబోధ చేశారు. మంత్రి పదవి నుంచి తప్పించిన వారికి ఆయా జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇకపోతే పాత మంత్రుల్లో కొందరిని కొనసాగించే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ పేర్కొనడంతో ఉండేదెవరు? ఊడేదెవరంటూ చర్చ జరుగుతుంది.

సీఎం వ్యాఖ్యలతో మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరికి పదవీ గండం ఉంటుందోనన్న ఆందోళన నెలకొంది. ఎవరు ఇన్ ఎవరు ఔట్ అంటూ సరికొత్త చర్చకు తెరలేపారు. ఇదిలా ఉంటే ఆశావాహులు మాత్రం మంత్రి పదవుల కోసం అప్పుడే పైరవీలు మొదలుపెట్టారు. ఇంకొందరైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్‌పై పోటీపడి మరీ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఏప్రిల్ 11న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అప్పుడు కూడా వాయిదా పడితే ఇక జూలైలో మంత్రివర్గ విస్తరణ తథ్యం అని తెలుస్తోంది.

Tags:    

Similar News