'జొమాటో'లో కల్లును ఆర్డర్ చేసుకోవచ్చా..? వైరలైన డెలివరీ పిక్స్
టెక్నాలజీ పుణ్యమా అని మానవుడు కదలకుండనే పనులు చక్కబెట్టుకుంటున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ పుణ్యమా అని మానవుడు కదలకుండనే పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ప్రపంచాన్నేగుప్పిట్లో పెట్టుకుని కాలు కదపకుండా తనకు కావాల్సిన వాటిని సొంతం చేసుకుంటున్నాడు. మానవుడికి కావాల్సిన సకాల వస్తువులు నేడు యాప్‌ల ద్వారానే పొందుతున్నాడు. గుండుపిన్ను నుంచి ఎయిర్ బస్ వరకు ఆన్ లైన్‌లోనే కొనేస్తున్నాడు. ఆన్‌లైన్‌లోనే కడుపు నింపుకుంటున్నాడు. ఇలాంటి వారికోసమే ఎన్నో ఫుడ్ డెలివరీ యాప్స్ పుట్టుకొచ్చాయి. వాటిల్లో ప్రముఖమైనది జొమాటో. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ చేస్తామని ఇటీవలనే ప్రకటించిందీ సంస్థ. అయితే తాజాగా ఓ వ్యక్తి జొమాటో టీషర్ట్ వేసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కల్లు గీతకార్మికుడు జొమాటో టీ షర్ట్ ధరించి.. మోకు, ముస్తాదు, కల్లు ముంత(కుండ)లతో బహుళ అంతస్తుల మధ్యలో నుంచి సైకిల్‌పై వెళ్తున్న ఫొటో సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఫొటోను చూసిన వారంతా జొమాటో.. కల్లును కూడా ఆన్‌లైన్‌లో డెలివరీ చేస్తుందా అని ఆ యాప్‌లో తెగ వెతికేస్తున్నారు. మహానగరంలో కల్లును కూడా ఆర్డర్ చేసుకోవచ్చా అని ఇంటర్ నెట్‌ను శోధిస్తున్నారు.
అయితే నిజానికి జొమాటో కల్లు సర్వీస్‌ను ప్రారంభించలేదు కానీ ఓ గౌడ్ (గీతకార్మికుడు) మాత్రం ఆ కంపెనీ టీ షర్ట్ ధరించి కల్లు గీసేందుకు వెళ్తున్న క్రమంలో తీసిన ఫొటోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన కల్లును జొమాటో ఇలా ఆన్‌లైన్‌లో డెలివరీ చేస్తూ బాగుండు అంటూ కల్లు ప్రియులు, నెటిజన్లు కామెంట్లు పెడుతుండటం విశేషం.