సీఎం కేసీఆర్‌పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: భద్రాచలంలో వైభవంగా జరిగే సీతారాముల - Vijayashanti CM made sensational comments on KCR
దిశ, తెలంగాణ బ్యూరో: భద్రాచలంలో వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణానికి కావాల్సిన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలకు కేసీఆర్ సర్కార్ ఒక్క పైసా కూడా ఇవ్వడంలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఆరోపించారు. వేడుకల్లో సీఎం, దేవాదాయ శాఖ మంత్రి మేళతాళాల మధ్య నెత్తిన పెట్టుకొని తెచ్చే ఈ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవాలయం సొమ్ముతోనే కొంటున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె చెప్పారు. కానీ, ప్రభుత్వమే సమర్పిస్తున్నట్లు చెప్పుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు ఏటా ప్రపోజల్స్ పంపడం.., ప్రభుత్వం వాటిని పక్కన పడేయడం పరిపాటిగా మారిందని విమర్శలు చేశారు.
పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలకు ప్రభుత్వమే డబ్బులిచ్చే సంప్రదాయం తానీషా కాలం నుంచి వస్తోందని, అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ సర్కారు దీన్ని పట్టించుకోవడం లేదన్నారు. నాటి ప్రభుత్వాలు సీతారాముల కళ్యాణానికి సంబంధించిన జీవో జారీ చెయ్యగానే భద్రాద్రి ఆలయ అధికారులు ప్రభుత్వం పేరిట ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు కొనుగోలు చేసేవారని, సర్కారు నుంచి డబ్బులు రిలీజ్ కాగానే సొమ్ము స్వామి వారి అకౌంట్లో పడేదన్నారు.
కానీ తెలంగాణ వచ్చాక 2014 నుంచి జీవోలు తప్పా కనీసం పది పైసలు కూడా ఆలయ అకౌంట్లో జమ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన కొత్తలో 2015లో ఒకసారి మాత్రమే సీఎం హోదాలో కేసీఆర్ సీతారాములకు పట్టువస్త్రాలు తెచ్చారని, ఆ తర్వాత 2016లో చిన్న దొర హిమాన్షుతో పట్టువస్త్రాలు ఇప్పించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కాలరాస్తున్న కేసీఆర్‌కు ఆ దేవుడే తగిన శాస్తి చేస్తాడని విజయశాంతి పేర్కొన్నారు.