ప్రధాని మోడీని కేసీఆర్ ఎందుకు కలవలేదు: రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగలుగా మారాయని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి మండిపడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబు దొంగలుగా మారాయని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ధాన్యం కొనుగోళ్లపై ఒకరి తప్పును మరొకరు కప్పిపుచ్చుకుంటున్నారన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలను దోచుకోవడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని, విద్యుత్‌ఛార్జీలు పెంచి రూ.12 వేల కోట్లను రాష్ట్ర ప్రజలపై వేస్తున్నారని, విద్యుత్ సంక్షోభం రావడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఉచితాల పేరుతో ఎన్నికల హామీలు ఇచ్చారని, వాటిని సంస్థలకు చెల్లించకపోవడంతో బకాయిలు పెరిగిపోయయని, ఓ చేత్తో ఉచితం ఇస్తూ మరో చేత్తో విద్యుత్ బిల్లుల భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ప్రభుత్వంలోని పెద్ద మనుషులు విద్యుత్ బిల్లులు ఎగవేస్తుండటంతో నష్టాలు పెరుగుతున్నాయని, రూ.6 వేల కోట్లు ఎగవేశారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో విద్యుత్, డీజిల్, పెట్రోల్ ఛార్జీలు పెరుగలేదని, కానీ, నాలుగున్నర నెలల తర్వాత పెంచుతున్నారని ఆరోపించారు. ఎన్నికల కోసం మాత్రమే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగకుండా ఐదు నెలలపాటు ఆపారని, బీజేపీ కోణంలో జీడీపీ వృద్ధి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడమేనన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ నిరసనలు
విద్యుత్ ధరలు పెంచడం, గ్యాస్ ధరలు పెరగడం సమన్వయంతో జరిగాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుతున్నారని, మళ్లీ వాళ్లే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, ఇద్దరూ జేబు దొంగల తరహాలో మారిపోయారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై కాంగ్రెస్‌పార్టీ వరుసగా నిరసనలకు దిగుతుందని, ఈ నెల 30న అన్ని మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ఏఈ, డీఈ కార్యాలయాల ముందు నిరసన చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 31న మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్యాస్ ధరల పెంపుపై ఆందోళన చేస్తామన్నారు. ప్రతి ఇంటి ముందు గ్యాస్ సిలిండర్లకు పూల దండలు వేయాలన్నారు. వచ్చేనెల 4న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని, సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కోరారు. ఏప్రిల్ 5న కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడించాలని, ఏడున విద్యుత్ సౌధ, సివిల్ సప్లై ఆఫీస్‌లను ముట్టడించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీపీసీసీ, ఏఐసీసీ నేతలు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటారని, ప్రతి నిరసనకు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరారు.
చచ్చే వరకు ధాన్యం కొంటామన్నారు
ధాన్యంపై కలిసికట్టుగా కథ నడిపిస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎవరికి అమ్ముకుంటుందో రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఈ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం పెట్టదన్నారు. కేసీఆర్ చావలేదని, కేసీఆర్ బతికి ఉన్నంతకాలం ప్రతి గింజా కొంటామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు మరిచిపోయారా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఢిల్లీలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటే తామే ఏర్పాట్లు చేస్తామని సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో అసలు మోడీని ఎందుకు కలువడం లేదని, ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు కేసీఆర్ ఎందుకు ప్రయత్నం చేయడం లేదని, ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందంలో కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు లేడని ప్రశ్నించారు. రూ.10 వేల కోట్లు ఇస్తే ధాన్యం మొత్తం కొనే బాధ్యతను కాంగ్రెస్పక్షాన తామే తీసుంటామని, ధాన్యం కొనుగోళ్లలో లేని సమస్యలను టీఆర్ఎస్, బీజేపీ రాజకీయం చేస్తున్నాయన్నారు. కేసీఆర్ ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కాంగ్రెస్ శ్రేణులతో రక్షణ వలయం ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.