గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే విటమిన్ 'కె'!
దిశ, ఫీచర్స్ : ఇటీవలి కాలంలో గుండె జబ్బులు సర్వసాధారణంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా 32 శాతం మరణాలకు కార్డియోవాస్కులర్ వ్యాధులు (CVD) ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవలే వెల్లడించింది..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ఇటీవలి కాలంలో గుండె జబ్బులు సర్వసాధారణంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా 32 శాతం మరణాలకు కార్డియోవాస్కులర్ వ్యాధులు (CVD) ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవలే వెల్లడించింది. గ్లోబల్ హెల్త్ బాడీ అంచనాల ప్రకారం 2019లో 17.9 మిలియన్ల మంది సీవీడీల వల్ల మరణించగా.. వీటిలో 85% గుండెపోటు, స్ట్రోక్ కారణంగా సంభవించాయి. అదనంగా హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్ వంటి హృదయ సంబంధ సమస్యలకు బలైపోతున్న యువకుల సంఖ్య పెరగడంతో.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి 'కె' విటమిన్‌ను తగినంతగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ విటమిన్ ఉపయోగాలతో పాటు అది ఎందులో ఎక్కువగా లభిస్తుందో తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన జీవితానికి విటమిన్ కె ఎంతోమేలు చేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరిచేందుకు, గుండెలో రక్తం గడ్డకట్టకుండ చూసేందుకు, అలాగే క్యాన్సర్ కణాలు వృద్ధిని అడ్డుకునేందుకు విటమిన్ కె తోడ్పడుతుంది. గాయాలు నయం చేయడం, ఎముకలకు బలాన్ని అందించడంలో కూడా ఇది అవసరం.
గుండె పదిలం:
విటమిన్ K అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే వ్యక్తులు అథెరోస్క్లెరోసిస్-సంబంధిత కార్డియోవాస్కులర్ వ్యాధికి 34% తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉన్నారని న్యూ ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయం (ECU) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ధమనుల్లో కొలెస్ట్రాల్, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించాలంటే ఆహారంలో విటమిన్ కె తప్పక చేర్చాలని సూచిస్తు్న్నారు.
ఆ అలవాట్లే కారణమా?
అనారోగ్యకరమైన ఆహారం, పొగాకు వాడకం, మద్యపానం వంటి అలవాట్లు గుండె జబ్బులు, స్ట్రోక్‌కి ప్రమాదకారకాలుగా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఇవేకాకుండా బీపీ, షుగర్, శరీరంలో పెరిగిన బ్లడ్ లిపిడ్స్, అధిక బరువు, ఊబకాయం వంటివి గుండెకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయి. అందువల్ల పొగాకు, మద్యం వినియోగాన్ని నిలిపివేయడంతో పాటు ఆహారంలో ఉప్పును తగ్గిస్తూ, ఎక్కువ పండ్లు, కూరగాయలు తినాలని సూచిస్తోంది. తద్వారా శారీరక శ్రమ, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పేర్కొంది. వీటితోపాటు తగిన మోతాదులో నిత్యం విటమిన్ కె ఆహారంలో ఉండేలా చూసుకోవాలని సూచించింది. ఈ మేరకు యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీసెస్ (NHS) పెద్దలకు ప్రతీ కిలోగ్రాము శరీర బరువుకు రోజుకు 1 మైక్రోగ్రాము విటమిన్ Kని సిఫార్సు చేస్తుంది.
పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలి వంటి ఆకుపచ్చని రంగులో ఉండే ఆకుకూరల్లో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. వీటిల్లో విటమిన్ కె తో పాటూ విటమిన్ ఎ, విటమిన్ సి కూడా ఉన్నాయి. కనుక వీటిని రోజూ తింటే బోలెడంత ఆరోగ్యం . ఒక కప్పు ఉడికించిన ఆకుకూరలలో 800గ్రాముల విటిమన్ కె ఉంటుంది. ఇక బ్లూబెర్రీస్, అత్తి పండ్లు సహా గుడ్లు, చీజ్‌లోనూ కె విటమిన్ లభ్యమవుతుంది. మాంసం, చిక్‌పీస్, సోయాబీన్స్, గ్రీన్ టీ వంటి వాటిల్లోనూ ఇది పుష్కలంగా లభిస్తుంది.