మహిళలపై విషం చిమ్ముతోన్న బ్రెస్ట్ క్యాన్సర్.. దీన్ని గుర్తించడంతో ఇప్పుడు ఈజీ

దిశ, ఫీచర్స్ : రొమ్ము క్యాన్సర్‌.. చాపకింద నీరుగా విస్తరిస్తూ చాలామంది మహిళలపై విషం చిమ్ముతోందీ మహమ్మారి. ప్రతీ 22 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశముందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి..Latest Telugu News

Update: 2022-06-26 07:53 GMT

దిశ, ఫీచర్స్ : రొమ్ము క్యాన్సర్‌.. చాపకింద నీరుగా విస్తరిస్తూ చాలామంది మహిళలపై విషం చిమ్ముతోందీ మహమ్మారి. ప్రతీ 22 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశముందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నిజానికి మహిళల్లో క్యాన్సర్ ఎక్కువగా రావడానికి ఆయా వ్యాధి లక్షణాలను విస్మరించడమే ప్రధాన కారణం. మహిళలు తమ ఆరోగ్యం, శరీరంలో వస్తున్న చిన్న చిన్న మార్పులను గమనించి తదనుగుణంగా టెస్ట్‌లు చేసుకుంటే చాలా వరకు ప్రమాదకరమైన క్యాన్సర్లను సైతం అడ్డుకోవచ్చు. అయితే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే పరీక్షలు నొప్పిని కలిగించేవి కావడంతో చాలా మంది స్త్రీలు వాటిని విస్మరిస్తారు. ఈ నిర్లక్ష్యమే వ్యాధిని ఆలస్యంగా గుర్తించడానికి దారితీయడంతో ఇది ప్రాణాంతకం కావచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగా రేడియేషన్-రహిత, నాన్-టచ్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ అందించే థర్మల్ ఇమేజింగ్ డివైజ్‌ 'నిరామై'(NIRAMAI)ను రూపొందించింది. ఈ డివైజ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

మనసుకు దగ్గరైన, ప్రియమైన వ్యక్తి మరణిస్తే.. భరించలేకపోతాం, ఆ దు:ఖాన్ని ఆపుకోలేకపోతాం. అయితే ఒక్కోసారి అలాంటి హృదయవిదారకరమైన సంఘటన నుంచే కొత్త ఆవిష్కరణలు పురుడుపోసుకుంటాయి. 'నిరామై హెల్త్' అనలిటిక్స్ ఫౌండర్ అండ్ సీఈవో గీతా మంజునాథ్ విషయంలోనూ ఇదే జరిగింది. మంజునాథ్‌కు ఇష్టమైన బంధువు రొమ్ము క్యాన్సర్‌తో ఆకస్మికంగా మరణించడంతో ఆమె ఈ ప్రాణాంతక వ్యాధి గురించి పరిశోధించేందుకు తన మొత్తం సమయాన్ని కేటాయించింది. ఈ క్రమంలోనే భారతదేశంలోనే రొమ్ము క్యాన్సర్‌తో ఏటా 90,000 మంది మహిళలు మరణిస్తున్నారని, వీటిలో దాదాపు 96 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు ఆలస్యంగా కనుగొనడం వల్లే సంభవించాయని తెలుసుకుని ఆవేదన చెందింది. మూడో దశలో గుర్తించడం వల్ల రోగి కోలుకునే అవకాశాలను అది 50 శాతానికి తగ్గిస్తే, దీనికి విరుద్ధంగా, మొదటి దశలో రోగ నిర్ధారణ అయితే అది ఆ వ్యక్తి మనుగడ రేటును 96 శాతానికి మెరుగుపరుస్తుందని భావించింది. ఈ మేరకు మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ని పరీక్షించేందుకు థర్మల్ ఇమేజింగ్ డివైజ్‌ 'నిరామై'ను రూపొందించింది. ఇది సాధారణంగా ఉపయోగించే మామోగ్రఫీ పద్ధతి వలె కాకుండా టచ్ చేయకుండా, రేడియేషన్ అవసరం లేకుండా నొప్పి కూడా తెలియకుండా వ్యాధి లక్షణాలను గుర్తిస్తుంది.

గేమ్‌చేంజర్:

NIRAMAI ప్రధాన సాంకేతికతను థర్మలిటిక్స్ (Thermalytix) అని పిలుస్తారు, ఇది అధిక-రిజల్యూషన్ థర్మల్ చిత్రాలను విశ్లేషించేందుకు క్లౌడ్ బేస్డ్ AI- ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తుంది. థర్మల్ నమూనాల్లోని అసాధారణతలను AI- ఆధారిత సాఫ్ట్‌వేర్ గుర్తించి విశ్లేషిస్తుంది. ఈ మేరకు పరీక్ష నుంచి నివేదిక వరకు 20 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ప్రక్రియ పూర్తి కాగా ఇందుకు సంబంధించిన రిపోర్ట్ ఆటోమేటిక్‌గా మొబైల్ యాప్‌లో రూపొందించబడుతుంది. అంతేకాదు ఈ టెస్ట్ పారామెడిక్ ద్వారా కూడా చేయబడుతుంది. దీంతో వైద్యులు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆరోగ్య కార్యకర్తలతో ఈ టెస్ట్‌లు పూర్తిచేయొచ్చు. నిజానికి మనది అధిక జనాభా గల దేశం కాగా ఇక్కడ ప్రతీ 1,511 మందికి ఒక్క డాక్టర్‌ మాత్రమే ఉన్నారు. అందువల్ల ఈ డివైజ్ తప్పకుండా గ్రామీణ భారతానికి ఎంతో మేలు చేయనుందని వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు.

తక్కువ ధరలోనే:

నిజానికి మామోగ్రఫీ పరీక్షకు రూ. 3,500 కంటే ఎక్కువ ఖర్చవుతుండగా, నిరామై పరీక్షకు రూ. 1,000 - రూ. 1,500 మధ్య ఉంటుంది.ఇలా దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వైద్య సోదరుల నుంచి థర్మాలిటిక్స్‌ను అంగీకరించడం అంత సులభం కాలేదు. ఆతర్వాత ఏడాది పాటు ట్రయల్ రన్ చేసిన తర్వాత సానుకూల ఫలితాల కారణంగా 2018లో మొదట CMI హాస్పిటల్‌‌లో దీని సేవలు వినియోగించారు. ఈ మూడేళ్లలో ఇది అపోలో క్లినిక్స్, హెచ్‌సిజి క్యాన్సర్ హాస్పిటల్స్, రెయిన్‌బో హాస్పిటల్స్ వంటి 120 ఆస్పత్రుల్లో బ్రెస్ట్ స్క్రీనింగ్ సేవలను ఉపయోగిస్తోంది. గతేడాది నిరామై ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు డయాగ్నస్టిక్ ఖర్చులను మరింత తగ్గించేందుకు Mythri అనే థర్మాలిటిక్స్‌లో తక్కువ-స్థాయి వెర్షన్‌ను కూడా ప్రారంభించింది. మైత్రీతో, పరీక్ష ధర రూ. 150 - రూ. 200 పరిధిలో ఉంది. కంపెనీ ఇప్పటివరకు రోటరీ ఇంటర్నేషనల్ వంటి సామాజిక సేవా సంస్థలు, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, కర్ణాటక క్యాన్సర్ సొసైటీ వంటి ఎన్జీవోల భాగస్వామ్యంతో 3,500 క్యాంపులను నిర్వహించింది. రాబోయే కాలంలో ఇతర రకాల క్యాన్సర్‌లను గుర్తించగల, డయాగ్నస్టిక్ పరీక్షల ఖర్చును తగ్గించగల థర్మల్ ఇమేజింగ్ పరికరాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది.

'ప్రస్తుతం, ఎక్స్-రే-ఆధారిత మామోగ్రఫీ రొమ్ము క్యాన్సర్‌ను పరీక్షించడానికి ఉపయోగిస్తున్నారు. అయితే సమస్య ఏమిటంటే, 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళల్లో క్యాన్సర్‌ను గుర్తించడంలో ఈ సాంకేతికత అంతగా విజయవంతం కాలేదు. అలాగే, ఇది చాలా ఖరీదైనది కాబట్టి మహిళలు దీనికి దూరంగా ఉంటున్నారు. నిరామై విషయానికి వస్తే ఇది రేడియేషన్ రహితమైనది కావడం వల్ల గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల కూడా ఈ టెస్ట్ చేయించుకోవచ్చు. అంతేకాదు మిగతా టెస్ట్‌లతో పోలిస్తే థర్మల్ ఇమేజింగ్ నాన్-టచ్, నొప్పి లేనిది. ఐరోపా, కెన్యా, గ్రీస్, టర్కీ, లండన్, స్వీడన్, ఫ్రాన్స్, యూఎస్‌ఏలోనూ నిరామై పరికరం అందుబాటులో ఉంది

- గీతా మంజునాథ్


Similar News