అప్పుడు రిక్వెస్ట్... ఇప్పుడు దబాయింపు.. ప్రభుత్వ తీరు ఇదే..!
కరోనా ప్యాండమిక్‌లో పనిచేసినోళ్లకు సర్కార్జీతాలు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా ప్యాండమిక్‌లో పనిచేసినోళ్లకు సర్కార్జీతాలు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నది. గవర్నమెంట్ దవఖాన్లలో పనిచేయాలని అప్పట్లో బతిమిలాడిన అధికారులు, జీతాల విషయం ప్రస్తావిస్తే దబాయిస్తున్నట్లు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. దాదాపు 700 మంది డాక్టర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. జీతాలు ఇవ్వాలని డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డిని కోరినా ఫలితం లేకుండా పోయింది. జీతాల విషయంలో ఆయన నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని వాపోతున్నారు. పైగా ప్రశ్నించినోళ్లను విధుల నిర్వహణలో సతాయిస్తున్నట్లు సదరు డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై హెల్త్ సెక్రటరీ రిజ్వీ ని కలిసినా సమస్య పరిష్కారం కాలేదంటున్నారు. కష్ట కాలంలో తమతో పనిచేయించుకొని జీతాలు ఇవ్వాల్సిన సమయంలో చేతులేత్తేయడం సరైన విధానం కాదని వైద్యులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు, సర్కార్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో డాక్లర్లంతా సమ్మెకు దిగాలని సూత్రపాయంగా నిర్ణయించారు. ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న కొత్త మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ పర్మిషన్లు ఇచ్చే చాన్స్ తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. అయితే స్ట్రైక్‌పై త్వరలో ప్రణాళిక ను ప్రకటిస్తామని ఓ డాక్టర్ చెప్పారు.
అసలు ఏం జరిగిందంటే...?
2018 నీట్పీజీ బ్యాచ్‌కు ఏప్రిల్ 2021 లో కోర్సు ముగిసింది. ఇదే సమయంలో వెంటనే కొవిడ్ సెకండ్ వేవ్వచ్చింది. డాక్టర్ల కొరత ఉన్నందున ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేయాలని ఈ బ్యాచ్‌ను ప్రభుత్వం వేడుకున్నది. భయంకరమైన పరిస్థితులున్పప్పటికీ, ప్రజలకు సేవ చేసేందుకు డాక్టర్లంతా అంగీకరించారు. గతేడాది మే, జూన్, జూలై వరకు పనిచేశారు. కానీ పనిచేసినందుకు జీతాలు ఇవ్వకుండానే ఆటోమెటిక్‌గా ఈ డాక్టర్లను సర్కార్ విధులకు రావొద్దని ఆదేశాలిచ్చింది. దీంతో దాదాపు మూడు నెలల పాటు ఈ బ్యాచ్ డాక్టర్లంతా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్లీ థర్డ్‌వేవ్ సంకేతాలు రావడంతో వెంటనే డ్యూటీలకు హాజరు కావాలని సర్కార్ మళ్లీ కోరింది.
సర్కార్ విన్నపం మేరకు గతేడాది నవంబరులో ఈ బ్యాచ్‌కు చెందిన వారంతా సీనియర్ రెసిడెంట్‌లుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో చేరి పనిచేశారు. కానీ అప్పట్నుంచి ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదు. 700 మందిలో కొద్ది శాతం మందికి ఇటీవల కేవలం రెండు నెలల జీతాలు ఇచ్చి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. కానీ మెజార్టీ డాక్టర్లకు ఇవ్వలేదు. దీంతో ఈ బ్యాచ్‌కు చెందిన డాక్టర్లకు కుటుంబ పోషణ భారంగా మారింది. ఇలాంటి పరిస్థితి దేశ వ్యప్తంగా ఎక్కడా లేదని డాక్టర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
కష్టకాలంలో పనిచేసినోళ్లకు కష్టాలా..? ఓ రెసిడెంట్ డాక్టర్ ఆవేదన
కరోనా కష్టకాలంలో పనిచేసినోళ్లను కష్టాల్లోకి నెట్టేయడం దారుణం. పని చేయించుకోని జీతాలు ఇవ్వకపోవడం ఏమిటో అర్థం కావడం లేదు. నీట్పీజీ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన డాక్టర్లు కూడా ఈ బ్యాచ్‌లో ఉన్నారు. పనిచేయించుకొని జీతాలు ఇవ్వని ఏకైక రాష్ట్రం తెలంగాణే అని, వారి ముందు తాము అపహస్యం అయ్యే పరిస్థితికి వచ్చాం. ప్రభుత్వం వెంటనే జీతాలన్నీ చెల్లించాలి. లేదంటే తప్పనిసరిగా స్ట్రైక్‌కు వెళ్తాం.