బెదిరింపులకు పాల్పడుతున్న సూడో పోలీస్ అరెస్ట్..

దిశ ప్రతినిధి, హైదరాబాద్: అమాయక ప్రజలను - The fake policeman was arrested by Central Zone Task Force police

Update: 2022-04-05 14:13 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: అమాయక ప్రజలను పోలీస్ పేరుతో బెదిరించి దోపిడికి పాల్పడుతున్న ఓ అంతర్ రాష్ట్ర సూడో పోలీసును సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన మరాఠీ సృజన్ కుమార్ సూర్య, చరణ్, చెర్రీ(45) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. పదో తరగతి వరకు మాత్రమే చదివి మానేశాడు. 2007 సంవత్సరం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసాలకు తెరలేపాడు. నకిలీ ఐడీ కార్డు సృష్టించుకుని పోలీస్ పేరుతో పలువురిని బెదిరించి అందినకాడికి దోచుకునేవాడు. ఇలా తెలంగాణలో అతనిపై 14 కేసులు, ఏపీలో 4 కేసులు నమోదై ఉన్నాయి.

ఇదిలా ఉండగా గత ఫిబ్రవరి 7వ తేదీన అతను నగరంలోని నెక్లెస్ రోడ్డు బతుకమ్మ ఘాట్‌లో దంపతులు కారులో కూర్చుని ఉండగా వారి వద్దకు వెళ్లిన సృజన్ కుమార్ తన వద్ద ఉన్న నకిలీ పోలీసు గుర్తింపు కార్డును చూపి 'టాస్క్ ఫోర్స్ ఆఫీసర్' అని పరిచయం చేసుకున్నాడు. మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారంటూ వారిని అడిగాడు. మీపై కేసు నమోదు చేస్తామని తీవ్ర పరిణామాలు ఉంటాయని, డబ్బులు ఇస్తే వదిలేస్తానని బెదిరించాడు. అనంతరం వారిని బలవంతంగా బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని మిడ్‌వే బేకరీకి పక్కనే ఉన్న కమల్ వాచ్ షాప్‌కు తీసుకెళ్లి రూ.5,800లతో వాచ్ కొన్పించి గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించమని మహిళకు హుకుం జారీ చేశాడు. అతని బెదిరింపులకు భయపడి అతను కోరిన విధంగా డబ్బులు చెల్లించింది.

అనంతరం దంపతులను నెక్లెస్ రోడ్డుకు తీసుకెళ్లి అక్కడ వదిలి వేసి పారిపోయాడు. ఈ మేరకు బాధిత దంపతులు రామ్‌గోపాల్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వసనీయంగా సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు మంగళవారం సృజన్ కుమార్‌ను నగరంలో అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి ఓ హోండా యాక్టివా వాహనం, రెండు వాచ్ లు, 2.77 గ్రాముల బరువు గల బంగారు ఉంగరం, రెండు ఖరీదైన సెల్ ఫోన్లు, టార్చ్ లైట్, నకిలీ పోలీసు గుర్తింపు కార్డు, ఐ పాడ్ కేసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని తదుపరి విచారణ నిమిత్తం రాంగోపాల్ పేట పోలీసులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ సీఐ ఆర్ రఘునాథ్, ఎస్ఐ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News