Telangana News: టెట్ టెన్షన్.. ఎగ్జామ్సెంటర్లు క్లోజ్..ఆందోళనలో అభ్యర్థులు
దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ టెట్–2022 అప్లికేషన్ల గడువుకు ముందే ఎగ్జామ్ సెంటర్లను ఎత్తి వేశారు. కొత్త జిల్లాల
దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ టెట్–2022 అప్లికేషన్ల గడువుకు ముందే ఎగ్జామ్ సెంటర్లను ఎత్తి వేశారు. కొత్త జిల్లాల ప్రకారం ముందుగా 33 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కానీ, అనుకున్నదానికంటే దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. దీంతో పలు జిల్లాల్లో టెట్ సెంటర్లు ఎత్తివేశారు. దాదాపుగా మూడు రోజుల కిందటి నుంచే ఈ సెంటర్లను బ్లాక్లో పెట్టారు. దీంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి సొంత జిల్లా సెంటర్లు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో పక్క జిల్లాలో సెంటర్ పెట్టుకుంటున్నారు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం శనివారం సాయంత్రం వరకు టెట్ అప్లికేషన్లు 4 లక్షలు దాటాయి.
ఏడు జిల్లాల్లో ఆల్రెడీ బ్లాక్..
అప్లికేషన్లు అత్యధికంగా రావడంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల సెంటర్లను టెట్ వెబ్సైట్లో క్లోజ్ చేశారు. ఈ జిల్లాలకు చెందిన ఇంకా మిగిలిన అభ్యర్థులు మరో జిల్లా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవడం మినహా గత్యంతరము లేదని అధికారులు వెల్లడించారు. టెట్ అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు నేటితో (సోమవారం) ఆఖరి గడువు. మంగళవారం టెట్ అప్లికేషన్ సబ్మిషన్ క్లోజ్ అవుతుంది.
ఇంకా దాదాపు లక్షన్నర వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్ని సాంకేతిక సమస్యలతో టెట్ అప్లికేషన్లు చేసుకోవడం లేదు. దీంతో గడువు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజులు గడువు పెంచే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. చివరి నిమిషంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
నేడు మరిన్ని జిల్లాలు క్లోజ్
టెట్ అప్లికేషన్ల సామర్థ్యం మించుతుండటంతో.. దరఖాస్తుదారులకు చిక్కులు వస్తున్నాయి. తాజాగా సోమవారం నుంచి ములుగు, జగిత్యాల జిల్లాలను సైతం అధికారులు క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ అప్లికేషన్ల గడువు పెంచితే మాత్రం కేవలం నాలుగైదు జిల్లాలకే అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.