నిజామాబాద్‌లో టెన్షన్.. బీజేపీ రాష్ట్ర నేతపై చేయి చేసుకున్న మాజీ ఎమ్మెల్యే
దిశ ప్రతినిధి, నిజామాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణగుప్తపై నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ చేయి చేసుకున్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణగుప్తపై నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ చేయి చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం హనుమాన్ శోభయాత్ర సందర్భంగా జరిగింది. నిజామాబాద్ నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది శోభయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. జిల్లా కేంద్రంలో జరిగే శోభయాత్రను హిందూ ధార్మిక సంస్థలు, భజరంగ్ దళ్, బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. శనివారం హనుమాన్ జయంతి శోభయాత్ర ప్రారంభానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హాజరుకావాలి. ఉదయం 11 గంటలైనా శోభయాత్ర ప్రారంభం కాకపోవడంతో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ శోభయాత్రను ప్రారంభించాలని నిర్వాహకులను కోరారు. అక్కడే ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ ఆధ్వర్యంలో శోభయాత్ర ప్రారంభం జరుగుతుందని, ఎంపీ సైతం సమీప ప్రాంతానికి వచ్చారని అప్పటి వరకు ఆగాలని కోరారు.
అయితే, దేవుడి శోభయాత్ర ఏ ఒక్కరి కోసం ఆపడం సరికాదని వెంటనే ప్రారంభించాలని లక్ష్మీనారాయణ కోరారు. పోలీసులు కూడా అప్పటికే శోభయాత్రను ప్రారంభించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆ సమయంలో శోభయాత్రను ప్రారంభించేందుకు యెండల యత్నించగా ధన్‌పాల్ వారించారు. దానితో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే యెండల ధన్‌పాల్‌పై చేయి చేసుకుని తోసి వేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరి మధ్య గొడవ జరుగకముందే పోలీసులు జోక్యం చేసుకున్నారు. కానీ, అప్పటికే రెండు వర్గాలు చేరోవైపు చేరి ఒకరు ప్రారంభించాలని, మరొకరు శోభయాత్రను ఆపాలని యత్నించారు. పోలీసులు ఇరువర్గాలను శోభయాత్ర రథం ముందు నుంచి పక్కకు జరిపి ప్రారంభించారు. కంటేశ్వర్ గుడి వద్ద ప్రారంభమైన రథయాత్ర కొద్దిగా ముందుకు కదలిన తర్వాత పాలిటెక్నిక్ మీ సేవా వద్దకు చేరుకోగానే ఎంపీ వచ్చి అందులో భాగస్వామ్యులయ్యారు.
హనుమాన్ శోభయాత్ర సందర్భంగా జరిగిన ఈ ఘటన కు సంబంధించిన వీడియోలు తీసి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అవి కాస్త వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ నిజామాబాద్ అర్బన్‌లో ఉన్న గ్రూప్ రాజకీయాలు బహిర్గతమయ్యాయి. యెండల వర్గంగా, ఎంపీ అర్వింద్ మరొక వర్గంగా నిజామాబాద్ అర్బన్‌లో జరుగుతున్న రాజకీయం బీజేపీలో ఉన్న విభేధాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల కార్పొరేటర్‌ల సమావేశంలో ఎంపీ అర్వింద్‌తో కొందరు కార్పొరేటర్లు విభేదించిన విషయం బహిర్గతం కాకముందే రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఇది వరకు యెండలపై అర్వింద్ వర్గం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా బీజేపీలో ఉన్న లుకలుకలు బట్టబయలు వాటిని టీఆర్ఎస్ సోషల్ మీడియా పెట్టి వైరల్ చేస్తున్నారు.