ప్రశ్నించే తత్వం ఉండకూడదనే రాజ్యాంగ మార్పు కోరుకుంటున్న కేసీఆర్: ప్రొఫెసర్ కోదండరాం

దిశ, కామారెడ్డి రూరల్: సీఎం కేసీఆర్ నియంతృత్వ - Telangana Jana Samithi President Professor Kodandaram comments on cm kcr

Update: 2022-03-15 16:33 GMT

దిశ, కామారెడ్డి రూరల్: సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమే ఆయన నోటి నుంచి వచ్చిన రాజ్యాంగ మార్పు అని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం రాత్రి కామారెడ్డి పట్టణంలోని ఈఎస్ఆర్ గార్డెన్‌లో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సన్నాహక సదస్సు కార్యక్రమంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని మార్చే శక్తి కేసీఆర్ కు లేదన్నారు. రాజ్యాంగంపై గౌరవం లేని వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. రాష్ట్రంలో న్యాయం కావాలని రోడ్డెక్కితే అరెస్ట్ చేసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కేటీఆర్ నిర్మించుకున్న ఇంటిని చూడటానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, టీచర్ల బదిలీలపై దీక్ష చేసిన బండి సంజయ్, వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న మందకృష్ణ మాదిగ, నిరుద్యోగ సమస్య పై పోరాడిన మమ్మల్ని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.


రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే 80 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని, తప్పుడు లెక్కలు చెప్తూ ఉద్యోగాలను ప్రభుత్వం కుదిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 26 లక్షల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అవసరం అయితే రెండున్నర లక్షలు మాత్రమే కట్టారని, స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.మూడు లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు.


దేశంలోనే కేసీఆర్ తప్ప.. సచివాలయానికి రాకుండా పాలన చేసే ముఖ్యమంత్రులు లేరని, సీఎం అనేవాడు ప్రజల మధ్య ఉండాలని, తలదాచుకునేవాడు ఎప్పటికీ సీఎం కాలేడన్నారు. చైనా, సింగపూర్ రాష్ట్రాలు కేసీఆర్ కు ఆదర్శమని, అక్కడ ప్రశ్నించే వారు ఉండరన్నారు. దాని ద్వారానే కేసీఆర్ నోట రాజ్యాంగం మార్పు అనే పదం వచ్చిందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ప్రభుత్వ తప్పిదాలపై కోర్టు మెట్లెక్కి సమస్యలను సాధించుకుంటున్నామనే ఆ రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ అంటున్నాడని తెలిపారు.


రాజ్యాంగాన్ని కోల్పోవడం అంటే మనిషి మనిషిగా బ్రతికే స్వేచ్ఛ కోల్పోవడమేనన్నారు. వీటన్నింటికీ సమాధానం కోసమే, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ఏప్రిల్ 9 న హైదరాబాదులో యుద్దభేరికి పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఆ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు 2 కిలోమీటర్ల మేర చేపట్టే ర్యాలీ చారిత్రాత్మకంగా నిలవనుందని చెప్పారు. ఉద్యమాలకు కేరాఫ్ అడ్డాగా ఉన్న కామారెడ్డి జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని కోరారు.

Tags:    

Similar News