దిశ, ముధోల్ రూరల్: సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన ముధోల్‌లో రూ. 8 కోట్లతో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని వివరించారు.
ముఖ్యంగా కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం అందించిన వైద్య సేవలు ప్రజల ప్రశంసలను అందుకుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంన్నారని అన్నారు. తాగు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వ్యవసాయ రంగంలో ముందుకెళ్లడంలో భాగంగా రైతులకు రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు నిరుపేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అభివృద్ధిపై చేస్తున్న విమర్శలను కార్యకర్తలు ఎక్కడెక్కడ చర్చించాలని సూచించారు. ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పట్టుబట్టి మరి పని చేసుకోవడాన్ని ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ప్రజలు సంక్షేమ పథకాలతో లబ్ధి పొందాలని సూచించారు. మొదటిసారిగా ముథోల్ కొచ్చిన ఆరోగ్య శాఖ మంత్రికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండి విటల్, జిల్లా పరిషత్ చైర్మన్ కోరుపల్లి విజయలక్ష్మి, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కరే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.