Sunil Kanugolu: టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మాజీ సహచరుడు?

TDP Hires Sunil Kanugolu as political strategist for 2024| ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నది. అయినా గెలవడం కోసం దొరికిన ఏ చిన్న అవకాశాన్నీ రాజకీయ పార్టీలు వదులుకోవడానికి ఇష్టపడడం లేదు.

Update: 2022-06-29 06:51 GMT

దిశ, ఏపీ బ్యూరో : TDP Hires Sunil Kanugolu as political strategist for 2024| ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నది. అయినా గెలవడం కోసం దొరికిన ఏ చిన్న అవకాశాన్నీ రాజకీయ పార్టీలు వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అనుభవజ్ఞులైన సీనియర్ నేతలు, నమ్మకమైన కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఇవన్నీ ఉన్నప్పటికీ.. ప్రస్తుత రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర చాలా ప్రముఖంగా మారింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో, అంతకంటే ముందు సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో వ్యూహకర్తలు పోషించిన పాత్రను ఎవరూ మరువరు. తాజాగా టీడీపీ కూడా ప్రస్తుత రాజకీయాల్లో వ్యూహకర్తల స్థానాన్ని గుర్తించిందో ఏమోగానీ ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలును రంగంలోకి దించుతుందన్న వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఎవరీ సునీల్ కనుగోలు?

గతంలో ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐ -ప్యాక్ కోసం సునీల్ కనుగోలు పనిచేశారు. నిజానికి ప్రశాంత్ కిషోర్ కంటే ముందు నుంచే రాజకీయాల్లో అందులోనూ మోడీకి వ్యూహకర్తగా పనిచేసిన అనుభవం అతడికి ఉందంటారు. కర్ణాటకకు చెందిన సునీల్ సుమారుగా 10 ఏళ్ల కు పైగా రాజకీయ వ్యూహకర్తగా వివిధ పార్టీల కోసం పని చేశారు. 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ కోసం పనిచేసిన వ్యూహకర్తల్లో సునీల్ ఒకరు. తర్వాత నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారు. అంతకు ముందే డీఎంకే, అకాలీదళ్, ఏఐడీఎంకే వంటి పార్టీల క్యాంపెయినింగ్ లో సునీల్ పాత్ర చాలానే ఉంది. తాజాగా తెలంగాణ, కర్ణాటకలో క్షేత్రస్థాయిలో సర్వే చేసి గెలుపునకు దోహదం చేసే అంశాలపై కాంగ్రెస్ కోసం పని చేయడానికి ఆయన సన్నద్ధమయ్యారు.

టీడీపీని వేధిస్తున్న సెకండ్ లెవెల్ లీడర్ షిప్ లేమి

మరోవైపు టీడీపీ కూడా సెకండ్ లెవెల్‌లో నాయకత్వ లేమితో సతమతమవుతున్నది. చంద్రబాబు ఒక్కరే ఇప్పటికీ పార్టీని భుజాలపై మోస్తున్నారని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. ముఖ్యంగా చాలామంది పార్టీ నేతలు సైలెంట్‌గానే ఉంటూ వస్తున్నారు. విచిత్రంగా టికెట్ ఆశిస్తున్న వారిలోనూ 60 శాతం మంది పార్టీ కార్యక్రమాల్లో యాక్టీవ్‌గా ఉండడం లేదని హై కమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. ఒక పక్క ఆర్థిక భారంతోపాటు కేసుల భయమూ వారిని మౌనం వహించేలా చేస్తున్నది అన్న వాదన లేకపోలేదు.

అప్డేట్ కాని పోరాట పంథా

ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ ఇప్పటికీ అనేక అంశాల్లో ప్రభావితంగానే కనిపిస్తున్నా.. ఇంకా మూసపద్ధతిలోనే రాజకీయం చేస్తుందన్న విమర్శ ఉంది. లోకేశ్ అండ్ టీమ్ ఎంత ప్రయత్నిస్తున్నా.. పార్టీ నేతల్లో చాలామంది అప్డేట్ కావడం లేదన్న భావన పార్టీ అధినాయకత్వంలో ఉంది. ఎంతసేపూ అధికార పార్టీని విమర్శిస్తూ పోవడమే తప్ప.. జనం అసలు ఏం కోరుకుంటున్నారు. వారి సమస్యలు ఏంటి అనేదానిపై క్షేత్రస్థాయి పరిశీలన చాలా అవసరం అని భావిస్తున్న నేపథ్యంలో టీడీపీ సునీల్ కనుగోలు సేవల‌పై దృష్టి పెట్టిందని కథనాలు వినవస్తున్నాయి.

సునీల్ తో అవగాహనకొచ్చిన పార్టీ..

2024 ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ పోరాటంగా తీసుకుని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. ఆయన తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా శక్తి వంచన లేకుండా జనంలో తిరుగుతున్నారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ చాన్స్ తీసుకోవడానికి చంద్రబాబు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్‌తో దూరంగా ఉంటున్న సునీల్ కనుగోలు సేవలను పార్టీ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. పైగా దక్షిణాదికి చెందిన సునీల్‌కు ఇక్కడి ప్రజల సెంటిమెంట్స్ బాగా తెలుసు. ఆయన మరింత ఎఫెక్టివ్ గా పరిస్థితులను అంచనా వేయగలరని టీడీపీ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే గత టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన కీలక వ్యక్తి ఇప్పటికే హైదరాబాద్‌లో సునీల్ ను కలిశారని, వారిమధ్య సునీల్ సేవలను పార్టీ కోసం వాడుకునే విషయంలో చాలా వరకూ అవగాహనకు వచ్చారని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంలో వాస్తవం ఏమిటో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News