ఆటోమొబైల్ పరిశ్రమలో పీఎల్ఐ పథకానికి 20 కంపెనీలకు ఆమోదం!

Update: 2022-02-11 12:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆటోమొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం ద్వారా లబ్ధిపొందేందుకు మారుతీ సుజుకి, మహీంద్రా, అశోక్ లేలాండ్, హ్యూండాయ్ సహా 20 కంపెనీలకు ఆమోదం లభించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ జాబితాలో టాటా మోటార్స్, ఫోర్డ్, కియా వంటి కార్ల తయారీ కంపెనీలతో పాటు బజాజ్, హీరో, టీవీఎస్ లాంటి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు, కొత్త నాన్-ఆటోమోటివ్ కింద హాప్ ఎలక్ట్రిక్ మాన్యుఫాక్చరింగ్, ఓలా ఎలక్ట్రిక్ లాంటి కొత్త కంపెనీలు కూడా పీఎల్ఐ పథకానికి ఎంపిక చేయబడ్డాయి. ఆమోదం ఉన్న కంపెనీల నుంచి రూ. 45,016 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని, దీంతో పరిశ్రమలో పీఎల్ఐ పథకానికి అద్భుతమైన స్పందన వచ్చిందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఆటోమోటివ్, ఆటో కాంపొనెంట్ పరిశ్రమ కోసం రూ. 25,938 కోట్ల పీఎల్ఐ పథకాన్ని నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద మొత్తం 115 కంపెనీలు తమ దరఖాస్తులను దాఖలు చేశాయి. 2022, ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్ల పాటు భారత్‌లో తయారీ చేయబడిన అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ, ఉత్పత్తుల(వాహనాలు, విడిభాగాలు) విక్రయాలకు పీఎల్ఐ పథకం కింద ప్రోత్సాహకాలు లభించనున్నాయి.

Tags:    

Similar News