ఇదో వింత స్నానం.. దీంతో అవన్నీ మాయం
దిశ, కామారెడ్డి రూరల్ : శరీర రుగ్మతలను, మలినాలను తొలగించుకోవడానికి మట్టి స్నానం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్
దిశ, కామారెడ్డి రూరల్ : శరీర రుగ్మతలను, మలినాలను తొలగించుకోవడానికి మట్టి స్నానం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు యోగ రామ్ రెడ్డి అన్నారు. ఆదివారం జంగంపల్లి చెరువు వద్ద ఎస్ఐ, పతంజలి యోగ సభ్యులు నిర్వహించిన మట్టి స్నానం కార్యక్రమంలో పాల్గొని యోగా సభ్యులనుద్దేశించి మాట్లాడారు. ఆరోగ్యం పొందడానికి, సమాజానికి సేవ చేసేందుకు యోగాకు మించిన సాధనం మరొకటి లేదని తెలిపారు. యోగసాధన ద్వారా ప్రతి వ్యక్తి వ్యక్తిగత ఆరోగ్యం పొందుతూ తద్వారా సమాజ సేవ కొరకు అంకితం కావాలని, అప్పుడే ఈ దేశం యొక్క సమైక్యత, భద్రత పెంపొందించబడుతుందన్నారు . యోగ మన పూర్వీకులు మనకు ప్రసాదించిన వెలకట్టలేని సంపద అని, ఈ సంపదను కాపాడుకోవడానికి, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, శరీర రుగ్మతలను తొలగించుకోవడానికి ఔషధగుణాలున్న మట్టి స్నానం చేయడం జరిగిందన్నారు. ఈ మట్టి స్నానం చేయడం వల్ల శరీరంలోని స్వేద రంధ్రాలు తెరచుకుని శరీరంలో ఉన్నటువంటి మలినాలు బయటకు వెళ్లి పోతాయన్నారు. దీంతో మన శరీరం ఉత్తేజంగా కనపడడానికి ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరము పంచభూతాల్లో తనలో కలుపుకొనే గుణం గల మట్టి ద్వారా శరీరంలో ఉన్నటువంటి మలినాలను దూరం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పెట్టిగాడి అంజయ్య, రఘు కుమార్, ఈశ్వర్, లక్ష్మీపతి, రామ్ చందర్, గంగారెడ్డి, సత్యనారాయణ, ఎల్లయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.