భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. telugu latest news
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. గత వారంలో రికార్డు నష్టాల నుంచి కోలుకున్న తర్వాత సోమవారం నాటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఐటీ రంగాల నుంచి కీలక మద్దతు లభించడంతో అధిక లాభాలతో ర్యాలీ చేశాయి. ముడి చమురు ధరలు రికార్డు స్థాయి నుంచి ధరలు దిగొస్తుండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు మొదలవడంతో ఉదయం నుంచే సానుకూలంగా మొదలైన సూచీలు ఆ తర్వాత రష్యా చమురుతో పాటు ఇతర వస్తువులను భారత్‌కు రాయితీతో విక్రయించనున్నట్టు వస్తున్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలో జోరు పెరిగింది. ఈ పరిణామాలతో మిడ్-సెషన్ తర్వాత మదుపర్లు కొనుగోళ్లను పెంచారు. ముఖ్యంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణ ఆందోళనలు ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు సానుకూలంగా ట్రేడింగ్ నిర్వహించారు.
దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 935.72 పాయింట్లు ఎగసి 56,486 వద్ద, నిఫ్టీ 240.85 పాయింట్లు పెరిగి 16,871 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు 2 శాతానికి పైగా పుంజుకోగా, మెటల్, ఫార్మా రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా, డా రెడ్డీస్, టాటా స్టీల్ షేర్లు మాత్రమే నష్టాలను చూడగా, మిగిలిన అన్ని కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, మారుతీ సుజుకి, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్, కోటక్ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.52 వద్ద ఉంది.