దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం భారీగా పడింది. ఉక్రెయిన్‌పై రష్యా దేశం మిలటరీ ఆపరేషన్ ప్రారంభించడంతో సూచీలు కనివినీ ఎరుగని రీతిలో కృంగిపోయాయి. గురువారం ఉదయం ప్రీ-మార్కెట్ సమయంలోనే ఏకంగా 1,600 పాయింట్లు కుదేలైన సెన్సెక్స్ ఇండెక్స్ ఆ తర్వాత 2000 పాయింట్ల వరకు దెబ్బతిన్నది. మిడ్-సెషన్ సమయంలో కొంత నిలదొక్కుకునే ప్రయత్నం చేసినప్పటికీ గ్లోబల్ మార్కెట్లు, దేశీయంగా ఇతర ప్రతికూల అంశాల ప్రభావంతో సూచీలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బతీశాయి. మిడ్-సెషన్ తర్వాత మార్కెట్ల నష్టాలు సునామీ స్థాయిలో ఎగసిపడ్డాయి. దీనివల్ల సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్‌లు రెండూ దాదాపుగా 5 శాతం పడిపోవడంతో, స్టాక్ మార్కెట్లు చరిత్రలోనే అతిపెద్ద నాలుగో సింగిల్ డే పతనాన్ని చవి చూశాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,702.15 పాయింట్లు కుదేలై 54,529 వద్ద, నిఫ్టీ 815.30 పాయింట్లు పడిపోయి 16,247 వద్ద ముగిశాయి. నిఫ్టీ లో అన్ని రంగాలు నేలకు జారాయి. అత్యధికంగా పీఎస్‌యూ బ్యాంకు 8 శాతం, రియల్టీ, మీడియా, ఆటో, ప్రైవేట్ బ్యాంక్, మెటల్, ఫైనాన్స్ రంగాలు 5-7 శాతం క్షీణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో అన్ని కంపెనీల షేర్లు ఎరుపు రంగులో ట్రేడయ్యాయి. అత్యధికంగా ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, విప్రో, ఆల్ట్రా సిమెంట్, ఏషియన్ పెయింట్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ షేర్లు 5-8 శాతం జారిపోయాయి. మిగిలిన షేర్లు 1-5 శాతం మధ్య నష్టపోయాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 75.73 వద్ద ఉంది.
ఒక్కరోజులో రూ. 14 లక్షల కోట్లు హాంఫట్..
రష్యా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో దేశీయంగా స్టాక్ మార్కెట్లలో మదుపర్లు భారీగా నష్టపోయారు. గురువారం సెషన్ ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 13.57 లక్షల కోట్లు పోగొట్టుకున్నారు. అంతకుముందు రోజు బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 256 లక్షల కోట్లు ఉండగా, రూ. 242.43 లక్షల కోట్లకు కృంగిపోయింది. స్టాక్ మార్కెట్లలోని ప్రతి 10 షేర్లలో 9 నష్టాలను ఎదుర్కొన్నాయి. అలాగే, ప్రతి 6 షేర్లలో ఒకటి లోయర్ సర్క్యూట్‌ని తాకాయి.