దిశ, అందోల్: గ్రామాభివృద్దిని పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శలపై ఉన్నతాధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చక్రియాల్, శివ్వంపేట గ్రామాల సర్పంచ్‌లు పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం చేసిన కారణంగా వారిని సస్పెండ్ చేయడంతో పాటు ఆయా గ్రామాల కార్యదర్శులకు చార్జీ మోమోలను జిల్లా పంచాయతీ రాజ్ అధికారి సురేష్ మోహన్ జారీ చేశారు. శివ్వంపేటలో తడి, పోడి చెత్తను ఇండ్ల నుంచి సేకరించకపోవడం, డంప్ యార్డును వాడకపోవడం, చెత్త సేకరణలో అలసత్వంగా ఉన్నందుకు సర్పంచ్‌తో పాటు కార్యదర్శికి షోకాజ్ నోటీసును జారీ చేశారు.
చక్రీయాల్ గ్రామంలో వీధులను శుభ్రంగా ఉంచకపోవడం, మురికి కాలువలలో ఇతర ప్లాస్టిక్ కవర్‌లను వేయడం, గత నెల రోజుల పాటు మురికి కాలువలను శుభ్రం చేయకపోవడం, పల్లె ప్రగతి పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకుగాను పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 37 (5) ప్రకారం సస్పెండ్ చేస్తూ, సర్పంచ్ ను, కార్యదర్శి కుమారి ఝాన్సి ని పదవీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో షోకాజ్ నోటీసును జారీ చేశారు.
ఇట్టి పనుల పర్యవేక్షణ విఫలమైనందుకుగాను మండల పంచాయతీ అధికారి ఎన్. స్వాతికి ఛార్జ్ మోమోను జారీ చేశారు. అదే విధంగా మునిపల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌కు అర్హతలేని డ్రైవర్‌ను నియమించినందుకు, వార్డు మెంబర్ మృతికి కారణమైనందుకు, భార్య సర్పంచ్ స్థానంలో భర్త జోక్యం చేసుకోవడం పట్ల సర్పంచ్ జాస్మీన్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలను జారీ చేశారు.