కూతురికి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేలోగా ఇల్లు గుల్ల
ఉద్యోగరీత్యా నాగపూర్ వెళ్తున్న తన కూతురిని హైదరాబాద్ లో ట్రావెలింగ్ బస్సు వద్దకు తీసుకువెళ్లి సెండాఫ్ ఇచ్చి రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి తాళం వేసిన ఇంటి తాళాలు విరగొట్టి ఇంట్లోని 12 తులాల బంగారు నగలను అపహరణ చేసిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో గల అశోక్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 3లో చోటుచేసుకుంది.

దిశ, జడ్చర్ల : ఉద్యోగరీత్యా నాగపూర్ వెళ్తున్న తన కూతురిని హైదరాబాద్ లో ట్రావెలింగ్ బస్సు వద్దకు తీసుకువెళ్లి సెండాఫ్ ఇచ్చి రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి తాళం వేసిన ఇంటి తాళాలు విరగొట్టి ఇంట్లోని 12 తులాల బంగారు నగలను అపహరణ చేసిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో గల అశోక్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 3లో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల పట్టణానికి చెందిన శ్రీనివాసమూర్తి డీఎంహెచ్ఓ ఆఫీస్ లో హెల్త్ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తమ కూతురు నాగపూర్ లోని ఓ కంపెనీలో ఉద్యోగం రావడంతో తమ కూతురికి ఉద్యోగరీత్యా నాగపూర్ పంపేందుకు ట్రావెలింగ్ బస్సు వద్దకు వెళ్లి సెండాఫ్ ఇచ్చేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి 7 గంటలకు ఇంటికి తాళం వేసి వెళ్లారు.
కూతురికి సెండాఫ్ ఇచ్చి రాత్రి 12:30 గంటల సమయానికి ఇంటికి వచ్చి చూడగా తాళం వేసిన ఇంటికి తాళాలు విరగొట్టి ఇంటి పరిసరాల్లో మిర్పొడి చల్లి ఉంది. ఈ విషయాన్ని గమనించిన శ్రీనివాసమూర్తి వెంటనే 100 కి డయల్ చేయగా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా ఇంటిలోని బీరువా తాళాలు విరగొట్టి బీరువాలోని 12 తులాల బంగారు నగలను దొంగిలించినట్లు గుర్తించారు. ఈ ఘటన పై ఫిర్యాదు అందుకున్న జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. జిల్లా కేంద్రం నుండి క్లూస్ టీంను రప్పించి చోరీకి పాల్పడిన వారి ఆధారాల కొరకు అన్వేషణ చేపట్టారు. కాగా రాత్రి 7 గంటల వరకు ఇంట్లోనే ఉండి ఏడు గంటల తర్వాత హైదరాబాద్ కు వెళ్లి కూతురికి సెండాఫ్ ఇచ్చి వచ్చేలోగానే విరగ్గొట్టి చోరీ జరగడంతో కాలనీవాసులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. పట్టణ పోలీసులు ఉన్న సిబ్బందితో నిరంతరం రాత్రి వేళలో గస్తీ కాస్తున్న కూడా జడ్చర్ల పట్టణంలో నిరంతరం చోరీలు జరుగుతుండడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదనపు పోలీస్ స్టేషన్ ఏర్పాటుతోనే చోరీలకు చెక్ ?
జడ్చర్ల మున్సిపాలిటీ పరిసరాల్లో పరిశ్రమలు ఫార్మా కంపెనీలు అనేకంగా ఉండడంతో మున్సిపాలిటీలో లక్షకు పైగా జనాభా నివాసం ఉంటున్నారు. అందుకు సరిపడా పోలీస్ సిబ్బంది పట్టణ పోలీస్ స్టేషన్లో లేకపోవడంతో మున్సిపాలిటీ విస్తీర్ణం బాగా పెరిగి ఎల్లవేళలా రద్దీగా మారింది. ఈ క్రమంలోనే పోలీసులకు గస్తీ కాయడం సవాల్ గా మారింది. గత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు జడ్చర్లలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో పాటు రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తూ అప్పటి ఇప్పటి అధికార పార్టీ నాయకులు అనేక మార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా కూడా నేటి వరకు కూడా అదనపు పోలీస్ స్టేషన్ మంజూరు చేయలేదని దీంతో పట్టణంలో చోరీల నియంత్రణ పోలీసులకు కత్తిమీద సాములా మారిందని ఇప్పటికైనా జిల్లా రాష్ట్ర ఉన్నత అధికారులు పట్టణ ప్రజల రక్షణకై జడ్చర్ల పట్టణానికి అదనపు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని జడ్చర్ల పట్టణ ప్రజలు కోరుతున్నారు.