దిశ, కంది : ఒక గ్రామం బాగుపడాలంటే అందుకు ఆ గ్రామాన్ని ముందుకు నడిపే సారధి సరైన దారిలో నడవాలి. అప్పుడే అందరి సహకారంతో ఆ గ్రామం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. గ్రామాభివృద్ధి తన లక్ష్యంగా మలచుకొని ఎక్కడ అవినీతికి తావు లేకుండా నిజాయితీగా నిలిచిన సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సర్పంచ్‌కు నిజాయితీ గల సర్పంచ్ అవార్డు దక్కింది.
నిజాయితీ అవార్డు ప్రదానం
సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎద్దుమైలారం గ్రామ సర్పంచ్ అయిన కాసాల మల్లారెడ్డి సర్పంచ్‌గా ఎన్నికైన నాటి నుంచి గ్రామ అభివృద్ధిలో ముందుండి సాగుతున్నారు. ఎక్కడా లేని విధంగా ఈ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైకుల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, తడి పొడి చెత్త వేరు చేసేందుకు అధునాతన మిషన్ ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీంతోపాటు గ్రామంలో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ ద్వారా గ్రామపంచాయతీకి సంబంధించిన టాక్స్‌లను వసూలు చేసే నూతన పద్ధతిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం.
ఇందులో భాగంగా గత నెల 27న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో నిజాయితీగా గ్రామాభివృద్ధికి కృషి చేసిన మొత్తం 15 మంది సర్పంచులకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో పెద్ద మైలారం సర్పంచ్ కాసుల మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఈ అవార్డును అందుకోవడంతో స్థానిక ప్రజలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
ఇదిలా ఉండగా ఎద్దుమైలారం గ్రామంలో మల్లారెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆయన్ను పలుమార్లు ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ఇతరులు కూడా ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కొనియాడిన సందర్భాలు గతంలో ఉన్నాయి.
అందరి సహకారంతో మరింత అభివృద్ధి
'నిజాయితీ సర్పంచుల అవార్డు ఎంపిక భాగంగా నన్ను కూడా ఎంపిక చేసి అవార్డు అందజేయడం ఎంతో ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో అందరి సహకారంతో ఏమని మరింత అభివృద్ధి చేసేలా కృషి చేస్తాను. గ్రామాన్ని ఆదర్శంగా నిలిపేలా చూడాలన్నదే నా తపన' అని ఎద్దుమైలారం సర్పంచ్ కాసాల మల్లారెడ్డి అన్నారు.