రాత్రంతా అదే శబ్ధం.. తట్టుకోలేక ఫిర్యాదు చేస్తున్న స్థానికులు
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాలర్యాంపులోని..Sand Mafia in Manuguru
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాలర్యాంపులోని గోదావరిలో మండలానికి చెందిన ఓ వ్యక్తి అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకున్నా అర్ధరాత్రి యథేచ్ఛగా ట్రాక్టర్ల ద్వారా గోదావరి ఇసుకను తరలిస్తున్నాడని మండల ప్రజలు చెబుతున్నారు. ఈ వ్యవహారమంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందని స్థానికులు అంటున్నారు. అర్ధరాత్రులు ఇసుక ట్రాక్టర్ల శబ్ధాలతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
అక్రమ ఇసుక దందాను అడ్డుకోవాల్సిన అధికారులే దగ్గరుండి ఇసుకదందాను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. నిజానికి స్థానిక రెవెన్యూ అధికారులు అక్రమార్కులు ఇచ్చే ముడుపులను భారీగా పుచ్చుకొని ఈ దందాపై దృష్టి సారించడంలేదనే విమర్శలే మండల వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అర్ధరాత్రుల్లో పదుల సంఖ్యలో గోదావరిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నా రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు చెప్పారు.