తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత.. గోదావరి నదిలో అడ్డగోలుగా ఇసుక దందా
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సర్కారు ఆదేశాలు, మైనింగ్ నిబంధనలను పాతరేసి.. గోదావరి నదిలో latest telugu news..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సర్కారు ఆదేశాలు, మైనింగ్ నిబంధనలను పాతరేసి.. గోదావరి నదిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. కొన్నిచోట్ల అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తుండగా.. మరికొన్ని చోట్ల అనుమతికి మించి తవ్వేస్తున్నారు. ఒక చోట అనుమతి తీసుకుని.. మరో చోట డంపింగ్ చేస్తున్నారు.. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారుల సహకారంతో ఇసుక వ్యాపారులు స్వాహా కార్యం చేస్తున్నారు. రాజకీయ అండ పుష్కలంగా ఉండటంతో.. ఇసుక దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇది చెన్నూరు నియోజకవర్గంలో అడ్డగోలు ఇసుక దందా.. నేతలు, కాంట్రాక్టర్ల దోపిడీ పర్వం..!
చెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండలం కొల్లూరు 5,6 బోరంపల్లి-2 లో ఇసుక రీచ్ లో తవ్వకాలు జోరుగా చేస్తున్నారు. గోదావరి నదిలో తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోటపల్లి మండలం లో మూడు చోట్ల క్వారీలు నడుస్తున్నాయి. రెండేళ్ల క్రితం అనుమతులు ఇచ్చారు. ఇసుక కోసం లారీల యజమానులు ఆన్‌లైన్ లో టీఎస్ఎండీసీకి దరఖాస్తు చేసుకుంటే.. వారు అనుమతి లభించాక డీడీ తీయాలి. క్యూబిక్ మీటరుకు రూ.600 చొప్పున 20 క్యూ.మీ. లకు గాను.. రూ.12 వేలు అవుతుంది.
ఇతర పన్నులతో కలిపి రూ.13150 అవుతుంది. ఇక రవాణా చార్జీలు వేరే ఉంటాయి. ఇక్కడ క్వారీ నిర్వాహకులు మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా.. సర్కారు ఆదేశాలను పట్టించుకోకుండా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3-5 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వాల్సి ఉండగా.. 20-30 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వేస్తున్నారు. గోదావరిలో లోతు వరకు ఇసుక ఉందని.. భూమిలో మట్టి వచ్చే వరకు తవ్వకాలు చేస్తున్నారు. దీంతో నీరు చేరటంతో.. లోతు తెలియక ఈ గుంతల్లో చనిపోతున్నారు.
బహిరంగ మార్కెట్లో రూ.45 వేల వరకు లారీ ఇసుక అమ్ముతున్నారు. సాధారణంగా లారీకి రూ.35 వేల వరకు ఖర్చవుతుండగా.. లారీల వారికి రూ.10వేల వరకు మిగులుతాయి. దీంతో క్వారీ వారితో మాట్లాడుకుని.. అధికంగా లోడు చేయించుకుంటున్నారు. వే బిల్లు కంటే ఒక బకెట్ ఇసుక అధికంగా వేస్తే క్వారీ నిర్వాహాకులు రూ.1500-2000 వరకు వసూలు చేస్తున్నారు. వేబిల్లును కాంటా వద్ద కూడా మేనేజ్ చేస్తుండగా.. వేబిల్లు కంటే లారీలో ఎక్కువ ఇసుక తరలించడం తో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. వాస్తవానికి వే బిల్లులు లేకుండా ఇసుక తరలించొద్దు.
క్వారీ నిర్వాహకులు, లారీ యజమానులు కుమ్మక్కై ఎలాంటి వే బిల్లులు లేకుండానే ఇసుక తరలింపు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ వారు అసలు తనిఖీలు చేయడం లేదు. ప్రతి నెలా మామూళ్లు ముడుతుండటంతో.. వారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రభుత్వం ఇసుక రాయితీ ఇవ్వటంతో.. క్యూబిక్ మీటరుకు రూ.150 చొప్పున 20 క్యూబిక్ మీటర్ల ఇసుకకు రూ.3 వేలు టీఎస్ఎండీసీకి డీడీ చెల్లిస్తే సరిపోతుంది. కాంట్రాక్టరు, అధికారుల సహకారంతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా ఇసుకను పక్కదోవ పట్టిస్తున్నారు. ఇలా దోపిడీ చేసిన డబ్బులను ఎవరి వాటా వారు పంచుకుంటున్నారు.