DK Aruna: జోగులాంబ సన్నిధికి రండి నిజానిజాలు తేలుద్దాం: డీకే అరుణ
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/ గద్వాల: అయిదవ శక్తిపీఠం అయిన అలంపూర్ - Revanth Reddy, BJP national vice-president DK Aruna challenged Minister KTR
DK Aruna
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/ గద్వాల: అయిదవ శక్తిపీఠం అయిన అలంపూర్ జోగులాంబ మాత సన్నిధికి రండి.. నిజానిజాలు తేలుద్దామని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ(DK Aruna) సవాల్ విసిరారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. బండి సంజయ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు.. ఆ పార్టీలో ఉన్న నేతలే స్వయంగా రేవంత్ రెడ్డిని బ్లాక్ మైలర్ అని విమర్శలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
గల్లీలోను.. ఢిల్లీలోనూ మీ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసని ఆమె అన్నారు. బండి సంజయ్ గ్రానైట్ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నాడని, కేసీఆర్ డైరెక్షన్‌లోనే సంజయ్ పని చేస్తున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం పట్ల డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. జోగులాంబ సన్నిధికి రా.. ఆ తల్లి మీద ప్రమాణం చేసి నిజానిజాలు తేలుద్దామని డీకే అరుణ సవాల్ విసిరారు. బీజేపీకి భయపడి ఇటు టీఆర్ఎస్.. అటు కాంగ్రెస్ పార్టీలు పీకేను ఆశ్రయిస్తున్నాయన్నారు. పీకే డైరెక్షన్‌లో రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకోవాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అని ఆమె తెలిపారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన ఈ రెండు పార్టీలకు ఎంతమంది పీకేలు సహకరించిన ప్రయోజనం ఉండదని చెప్పారు. ముమ్మాటికి నాటకాలు ఆడుతుంది టీఆర్ఎస్.. కాంగ్రెస్ నేతలే అని డీకే అరుణ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ బీజేపీ యాత్రకు వస్తున్న ఆదరణ చూసి అతని తండ్రి కేసీఆర్ లాగే మతి తప్పి మాట్లాడుతున్నారన్నారు.