నిర్లక్ష్యానికి గురవుతున్న రైతు వేదికలు.. పట్టించుకోని అధికారులు

దిశ, లక్షెట్టిపేట : రైతు వేదికలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అసౌకర్యాలు వెంటాడుతున్నా వాటి వైపు తొంగి చూసే.. Latest Telugu News..

Update: 2022-03-26 09:10 GMT

దిశ, లక్షెట్టిపేట : రైతు వేదికలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అసౌకర్యాలు వెంటాడుతున్నా వాటి వైపు తొంగి చూసే నాథుడే కరువయ్యారు. దీంతో ఒక్కొక్కటిగా వాటిపై సమస్యలు ముసురుకుంటున్నాయి. రైతులను సంఘటితం చేసి వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి వ్యవసాయంలో వచ్చే విప్లవాత్మక మార్పుల పై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. సౌకర్యాల కల్పనలో సంబంధిత అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ వాటిపై సరైన దృష్టి సారించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు వాపోతున్నారు.

నీటి సమస్య..

లక్సెట్టిపేట మండలంలోని ఐదు క్లస్టర్లలో రైతు వేదికలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ లక్సెట్టిపేటలోని మార్కెట్ యార్డ్, జెండా వెంకటాపూర్, వెంకట్రావుపేట, దౌడేపల్లి, సురారాం క్లస్టర్ గ్రామాల్లో రైతు వేదికలను నిర్మించారు. ఒక్కొక్క రైతు వేదికను రూ.22 లక్షలతో నిర్మించగా.. అందులో ఉపాధి హామీ నిధులు రూ.10లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.12 లక్షలు కేటాయించారు. ఈ వేదికలను నిర్మించి గత ఏడాది ప్రారంభించారు. ఒక్కొక్క రైతు వేదికలో క్లస్టర్ వారీగా ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి ప్రతి మంగళ, శుక్ర వారాల్లో రైతులకు సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.

పంట సాగు మెళకువలు, సాంకేతిక పద్ధతులు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఈ వేదికలకు రైతుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తున్నా..అక్కడక్కడ అసౌకర్యాలు ఇబ్బందికి గురిచేస్తున్నాయి. సూరారం రైతు వేదికలో బోరుకు ఉన్న కరెంటు మోటారు నెల రోజుల కిందట కాలిపోగా, ఇప్పటివరకు దాన్ని రిపేరు చేయించక పోవడంతో నీటి సరఫరా లేదు. బోరు నుంచి వాషింగ్ రూమ్, మరుగుదొడ్డికి పైప్ లైన్ కనెక్షన్ ఇంకా ఇవ్వనేలేదు. దీంతో వాషింగ్ రూమ్, మరుగుదొడ్డి నిరుపయోగంగా మారాయి.

జెండా వెంకటాపూర్ వేదిక వద్ద వాషింగ్ రూమ్, మరుగుదొడ్డి పనులు పూర్తైనా బోరు నుంచి వాటికి పైప్ లైన్, ట్యాప్ కనెక్షన్ లేదు. ఈ పనుల జాప్యంతో సమావేశాలకు వచ్చే రైతులు ఇక్కట్లు పడుతున్నారు. లక్షెట్టిపేట రైతు వేదిక వద్ద బోరు వేయలేదు, ఈ వేదిక వద్ద ట్యాంక్ కు మిషన్ భగీరథ నీటి సరఫరా కనెక్షన్ కలిపినా దాని వల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. భగీరథ నీరు వచ్చే సమయంలో ఇక్కడ ఎవరూ లేకపోవడం, ట్యాంక్ ను నింపక పోవడం ఇబ్బందిగా మారింది. ప్రత్యేకంగా బోరు వేస్తేనే ఇక్కడ అ నీటి ఇబ్బందులు తీరే అవకాశం ఉంది.

శాస్త్ర విజ్ఞానం అందేదెలా..?

రైతు వేదికల్లో సమావేశాలకు కుర్చీలు, బెంచీలు, మైక్ సిస్టమ్స్, కంప్యూటర్లు, వీడియో కాన్ఫరెన్స్‌కు అవసరమైన కేబుల్ నెట్ సదుపాయాలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలి. కానీ ఈ వేడుకల్లో కుర్చీలు, బెంచీలు, మైక్ సిస్టం, ల్యాప్ ట్యాప్ మినహా మిగతా సదుపాయాలు కనిపించడం లేదు. వీడియో కాన్ఫరెన్స్ ఎల్ఈడి స్క్రీన్ లేకపోతే రైతులకు సాంకేతిక శాస్త్ర విజ్ఞానం ద్వారా పంటలపై దృశ్య శ్రవణ రూపంలో ఎలా కనబడుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు వేదికల వద్ద వ్యవసాయ విస్తరణ అధికారులకు అదనపు నిర్వహణ భారం పడుతోంది. ఒక్కొక్క రైతు వేదికకు నెలకు నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం నుంచి రూ.2 వేల చొప్పున వారికి వస్తుంది.

దాంట్లో నుంచే క్లీనర్, విద్యుత్ ఛార్జీలు, ఇతర ఖర్చులకు వారే సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. నెలకు రూ. 1000 నుంచి రూ. 1500 ఇస్తే గాని క్లీనర్లు వేదిక వైపు చూడటం లేదు. ఇక మిగతా ఖర్చులు బేరీజు వేస్తే ప్రభుత్వం ఇచ్చే రూ.2వేలు వారికి సరిపోవడం లేదు. రైతు వేదికల వద్ద నెలకొన్న సమస్యలపై మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ ను సంప్రదించగా వాటి పరిష్కారానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. వేదికల వద్ద సౌకర్యాల కొరత లేకుండా చూస్తామన్నారు. వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అవసరమయ్యే ఎల్ఈడి స్క్రీన్‌లు, ప్రొజెక్టర్లు, రావాల్సి ఉందన్నారు.

Tags:    

Similar News