తెలంగాణపై రాహుల్ ఫోకస్.. రంగంలోకి కీలక నేత?

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణపై ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ నజర్ పెట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన చరిత్రను ముందేసుకుని.. కొత్త లీడర్లతో కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.

Update: 2022-04-06 00:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణపై ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ నజర్ పెట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన చరిత్రను ముందేసుకుని.. కొత్త లీడర్లతో కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేననే నినాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్లి.. ప్రత్యామ్నాయం కాదు.. అధికారంలోకి వస్తామనే భరోసాతో నేతలకు ముందుకు కదిలిస్తున్నారు. ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణపై కన్నేసింది. ఇక ముందు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఇప్పటి నుండే దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా తెలంగాణపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని ప్రయత్నంలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఓవైపు రెండు రాష్ట్రాలకు వ్యూహకర్తలను రంగంలోకి దింపుతూనే.. అటు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు.

దక్షిణాది వ్యూహం

రాష్ట్రంలో దక్షిణాది వ్యూహాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా సౌత్​నేతలను కీలకంగా పరిగణిస్తున్నారు. తెలుగు ప్రజల అలవాట్లు, ఆహార్యం, ఆహారం వంటి అంశాల్లో సౌత్​నేతలు చాలా ఈజీగా ఇమిడిపోవడమే కాకుండా వాటిని అందిపుచ్చుకుంటారని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

ఒకప్పుడు గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ తదితరులకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. పార్టీ ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నా, విమర్శలపాలైనా.. వారిని మార్చలేదు. కాంగ్రెస్ అంటే వృద్ధ నేతల పార్టీగా ఉండగా.. ఇప్పుడు సీన్ మారింది. అంతా యాభై ఏండ్లలోపు ఉన్న యూత్‌ను రంగంలోకి దింపారు. వ్యూహాలు రచించేది వాళ్లే.. ప్రజల్లోకి వెళ్లేది వాళ్లే. రాష్ట్రంలో ఓట్లు రాబట్టేదీ వాళ్లే. ఏఐసీసీ ఈ విషయంలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. పార్టీలోని పెద్దలను గౌరవిస్తూ యువతకు చేయూతనందిస్తూ ప్రతి కార్యకర్తకు వెన్నంటి ఉంటూ దూసుకుపోవడమే లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిలో భాగంగా రాష్ట్రానికి ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జీగా మాణిక్కం ఠాగూర్‌ను నియమించగా.. ఇప్పుడు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ను సైతం రంగంలోకి దింపింది. రాష్ట్ర నేతలకు ఆయనతో యాక్సెస్​ కల్పించినట్లు రాహుల్​ వెల్లడించిన తీరుతో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి స్పష్టమవుతోంది.

రెండింటా కాంగ్రెస్​కే మొగ్గు

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకారం ఇంకా రెండేళ్ల కంటే కొంచెం తక్కువ సమయమే ఉన్నా.. ఈ ఏడాది మధ్యంతరం నుంచే ఎన్నికల మోడ్‌లోకి వెళ్తారని భావిస్తున్నారు. దేశంలో ఉన్న రెండు ప్రధాన జాతీయ పార్టీలు తెలంగాణపై ఆశలు పెంచుకున్నాయి. దీనికి ప్రధాన కారణంగా.. సీఎం కేసీఆర్‌కు ఇది రెండో ఇన్నింగ్స్‌. అందుకే అంతో ఇంతో నెగెటివ్‌ ఓటు ఉండే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే తేలింది. దాన్ని సానుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ పునాదులు ఇంకా పదిలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఏఐసీసీ పరిశీలనలో కూడా అదే తెలిసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహకర వాతావరణంలో ఉన్న కాంగ్రెస్​కు రాష్ట్రంలోని పరిస్థితులు సంజీవనిగా మారునున్నాయి. ఇదే సమయంలో బీజేపీకి కర్ణాటక తర్వాత మరో స్థావరం దక్షిణాదిలో ఇంతవరకూ దొరకలేదు. దీన్ని కాంగ్రెస్​ అనుకూలంగా మల్చుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలో కాషాయదళం.. కాంగ్రెస్‌ స్థాయిని అందుకోవాలంటే కొంత కష్టమనే అభిప్రాయం బీజేపీలోనూ ఉన్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇప్పటికిప్పుడు ఓటుబ్యాంకు ఇంకా పదిలమేనని ఇటీవల పలు సర్వేల్లోనూ తేలింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు వ్యూహాలను రూపొందిస్తున్నాయి. రెండు నెలలకోమారు సర్వేలు చేసి ప్రజల నాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

ఏకాభిప్రాయమే మస్ట్

కుమ్ములాటలు లేకుండా పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపినట్లయితేనే పార్టీకి లాభమని రాహుల్​బృందం గుర్తించింది. క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడినట్లయితే ఎన్నికల నాటికి తమ పార్టీ పుంజుకొని మంచి ఫలితాలు సాధించగలుగుతుందని కాంగ్రెస్‌ అగ్రనేత పరిశీలనలో తేలింది. ఇటీవల సైలెంట్​వ్యూహకర్త సునీల్​ కనుగోలు టీం కూడా ఇదే అంశాన్ని తేల్చి చెప్పింది. హస్తం నేతల్లోని కుమ్మలాటలోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ కంటే బీజేపీ ముందుంటుందని, పార్టీ నేతలు ఎండ్రికాయల కథను నడిపిస్తూనే ఉన్నారని స్పష్టంగా తేలింది. అందుకే పంజాబ్‌ మోడల్‌ను తెలంగాణలో అమలు చేసేందుకు బీజేపీ కొంత ప్రయత్నాలు చేస్తుంటే.. కాంగ్రెస్​ మాత్రం దక్షిణాది వ్యూహాలను అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

కలువడమే పరిష్కారం

రాష్ట్ర నేతలను సమన్వయం చేయడమే కాకుండా పునర్ వైభవాన్ని తీసుకురావడానికి రాహుల్ గాంధీ రాష్ట్రంపై దృష్టి సారించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని రాహుల్ భావిస్తున్నారు. అయితే, అసంతృప్తి నేతల తిరుగుబాటును సైతం పరిశీలించారు. దీంతో రేవంత్‌కు పరోక్షంగా మద్దతు ఇస్తూనే.. ఇటు సీనియర్లను సైతం వెనకేసుకొచ్చినట్లు ఇటీవల నిర్వహించిన రెండు సమావేశాల్లో రాహుల్​వ్యవహరించారు. దీంతో ఇరువర్గాలు సైలెంట్​కావాల్సి వచ్చింది. ముందుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటాలు చేయాలంటూ కరాఖండిగా వెల్లడించారు.

మాట మారింది

రాహుల్ గాంధీ సమావేశం తర్వాత.. 130 ఏళ్ల గ్రాండ్‌ ఓల్డ్ పార్టీలో మరోసారి పాత పాట వినిపించింది. ఐక్యమత్యమే మహా బలం అంటూ 39 మంది నేతలు ఏకస్వరంతో రాగాలు తీశారు. ఓడిపోయామని దిగులు చెందకు.. ఇక ముందు గెలిచేందుకు ప్రయత్నించు అంటూ ధైర్యాన్ని రోట్లో నూరి పోశారంటూ రాహుల్​భేటీని వర్ణించుకుంటున్నారు. ఇక నుంచి టీఆర్ఎస్‌‌ను ఎలా ఓడించాలో, బీజేపీని ఎలా బండకేసి కొట్టాలనే లక్ష్యం మాత్రమే ముందుందంటున్నారు. దీంతో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమరానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఒంటరి పోరాటం అనే సంకేతాలు కూడా బలంగా ఇస్తున్నారు. బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతానని శపథం చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల కాలంలో తరచూ కాంగ్రెస్ అనుకూల వ్యాఖ్యలు చేస్తుండటం, పలు సందర్భాల్లో రాహుల్ గాంధీకి బేషరతుగా మద్దతు పలికిన దరిమిలా రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుపై వ్యూహాత్మక ప్రచారాలు వచ్చాయి. ఒక సందర్భంలో బీజేపీ దీనిపై ఎదురుదాడి చేసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనంటూ విమర్శలు చేశాయి. కానీ, కేసీఆర్ మాటల ట్రాప్‌లో పడిపోరాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్‌తో గానీ, దాని మిత్రపక్షం ఎంఐఎంతోగానీ పొత్తు ఉండబోదని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో పర్యటనకు వచ్చేందుకు కూడా రాహుల్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఒకే నెలలో రెండు సార్లు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ప్రాథమికంగా చెప్పుతున్నారు. ఈ నెల 28న వరంగల్‌లో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారని, 29న హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Tags:    

Similar News