ములాఖత్‌కు వచ్చిన సహచరుడి భార్యతో ఖైదీ ఎఫైర్.. జైలు నుంచి పరారై ఆమెతో..
ఆదిలాబాద్ జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తున్న ఖైదీ పరారైన కేసు కీలక మలుపు తిరిగింది.
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తున్న ఖైదీ పరారైన కేసు కీలక మలుపు తిరిగింది. ములాఖత్‌కు వచ్చిన సహచర ఖైదీ భార్యతో పరారైనట్లు అధికారులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. యవత్మాల్ జిల్లా జరీ మండలం పర్సోడ గ్రామానికి చెందిన నాగోరావుకు ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలానికి చెందిన ఓ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం కింద 2016 లో పదేళ్ల జైలు శిక్ష పడింది. వరంగల్ సెంట్రల్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్న నాగోరావును గత జూన్‌లో ఆదిలాబాద్ జైలుకు తరలించారు. సత్ప్రవర్తనతో మెలగడంతో జైలు అధికారులు గేదెల పాలు పితకడానికి వెసులుబాటు కల్పించారు. కాగా.. నాగోరావుతోపాటు మరో సహచర ఖైదీతో కలిసి జైలు సమీపంలో గేదెలు మేపడానికి వెళ్లేవాడు.
ఈ క్రమంలో ఇద్దరు ఖైదీల మధ్య స్నేహం కుదిరింది. సహచర ఖైదీ భార్య తరచూ జిల్లా జైలుకు ములాఖత్‌లో భాగంగా వచ్చి వెళ్ళేది. ఆమెతో నాగోరావుకు పరిచయం ఏర్పడింది. ఈ నెల 23న ఆమె ములాఖత్‌లో భాగంగా.. జైలుకు వచ్చి వెళ్ళింది. ఆమెకు మాయమాటలు చెప్పిన నాగోరావు ఈనెల 24న మళ్ళీ జైలు పరిసర ప్రాంతాలకు రప్పించాడు. గేదెలు మేపే ప్రాంతానికి రక్షణగా ప్రహరీ లేకపోవడంతో అదునుగా భావించిన అతడు జైలు సూపరింటెండెంట్ కుక్కను జైల్లో వెనుక కట్టేసి సదరు మహిళతో పరారయ్యాడు. కుక్క అరుపులు గుర్తించి జైలు సిబ్బంది అక్కడికి వెళ్లి చూడగా నాగోరావు పరారైనట్లు గుర్తించారు.
ఖైదీని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. జైనాథ్ మండల పరిధిలోని కోరాట- చనాక బ్యారేజీ సమీప ప్రాంతంలో సహచర ఖైదీ భార్య అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. ఆమెను పోలీసులు విచారించగా.. తన భర్త స్నేహితుడైన నాగోరావు తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది. ఖైదీని పట్టుకోవడానికి తెలంగాణతోపాటు మహారాష్ట్రలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా జైనథ్ మండలంలోని కూర గ్రామంలో అనుమానాస్పదంగా ఖైదీ తిరుగుతుండగా గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఖైదీని అదుపులోకి తీసుకుని జిల్లా జైలుకు తరలించారు.