అమ్మ, నాన్న, ఓ కూతురు.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు
అమ్మ.. నాన్న.. కూతురు.. వీళ్లే ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు.. అదేంటి దొంగల ముఠా అంటే వేరు వేరు latest telugu news..
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ / గద్వాల్ : అమ్మ.. నాన్న.. కూతురు.. వీళ్లే ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు.. అదేంటి దొంగల ముఠా అంటే వేరు వేరు నేర చరిత్రలు ఉన్నవారు.. ముఠాగా ఉంటారు కానీ.. భార్య, భర్త, మైనారిటీ తీరని ఓ కూతురు దొంగల ముఠాగా ఏర్పడడం ఏమిటి..? అని ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది అక్షరాల నిజం.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ విస్తుపోయే నిజాలను వెల్లడించారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న ఆవుల రవి తేజ, కిరణ్మయి భార్యాభర్తలు.. వీరికి 13 ఏళ్ల కూతురు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన భార్యాభర్తలు దొంగతనాలు చేయడం ఆరంభించారు.
మొదటి నుండి నేర చరిత్ర ఉన్న భార్యాభర్తలు జైలుకు వెళ్లి వచ్చిన వారే.. అయినా తీరు మారలేదు. వారు దొంగతనాలు చేయడమే కాకుండా.. అందులో తమ కూతుర్ని కూడా భాగస్వామిని చేశారు. సంవత్సర కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో వృద్ధులను టార్గెట్‌గా చేసుకొని ఈ ముఠా మొత్తం ఎనిమిది దొంగతనాలు చేసినట్లుగా ఎస్పీ వెల్లడించారు. గత సంవత్సరం అలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా ఉన్న 60 సంవత్సరాల వృద్ధ మహిళ వద్దకు వెళ్లి.. మీ ఇంటికి లోన్ వచ్చింది. మేము వివరాలు తెలుసుకోవడానికి వచ్చిన అధికారులమని మాయమాటలు చెబుతూ ఆమె పై మత్తు మందు స్ప్రే చేసి మూడు తులాల బంగారం దోచుకుని బైక్ పై పారిపోయారు.
ఆరు నెలల తర్వాత అలంపూర్ లోని 70 సంవత్సరాల వయసున్న వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి మాయ మాటలు చెబుతూ.. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగిలించే ప్రయత్నం చేయడం. జాగ్రత్త పడ్డా వృద్ధురాలు అరవడంతో ముఠా సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారని ఎస్పీ వెల్లడించారు. 2021 ఆగస్టు నెలలో కర్నూలు బాలాజీ నగర్ లో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలి నుంచి నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అక్టోబర్ నెలలో కర్నూల్ బాలాజీ నగర్ లోని బైరెడ్డి రైస్ మిల్ దగ్గర కూరగాయలు అమ్మే మహిళ ఇంట్లో రెండు తులాల బంగారం, నవంబర్ నెలలో కర్నూలు రైల్వే స్టేషన్ ఎదురుగా నివాసముంటున్న వృద్ధురాలి బీపీ చెక్ చేస్తామని మాయమాటలు చెప్పి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారాన్ని దొంగిలించారు.
డిసెంబర్ నెలలో బాలాజీ నగర్ లోని సుచిత్ర రెసిడెన్సీ లో ఉన్న వృద్ధురాలికి టీకా వేస్తామని మాయమాటలు చెప్పి రెండున్నర తులాల బంగారు గొలుసును దొంగిలించారు. లక్ష్మీ నరసింహ టెంపుల్ దగ్గర ఇంట్లోకి ప్రవేశించి సచివాలయం నుంచి వచ్చామని అబద్ధాలు చెప్పి వృద్ధురాలి నుంచి రెండున్నర తులాల గొలుసు దొంగలించారు. 2022 ఫిబ్రవరి లో కర్నూలు బాలాజీ నగర్ కేశవరెడ్డి స్కూల్ సమీపంలోని ఇదే విధమైన ప్రయోగం చేసి వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును దొంగిలించారు. వీరి ముగ్గురిని అలంపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయని ఎస్పీ తెలిపారు.
వీరి నుంచి 50 గ్రాముల బంగారు గొలుసులు, ఒక ఆల్టో కారు, బైకు, 3 మొబైల్స్, కట్టర్, బీపీ మిషన్ తదితరాలను స్వాధీనపర్చుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రధాన భూమికను పోషించిన డీఎస్పీ రంగస్వామి, అలంపూర్ ఎస్సై శ్రీహరి, ఏఎస్ఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ కుమార్, నరసింహులు, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ సుల్తాన్ బాబు, పరశురామ్, చంద్రబాబు, మహేష్ సాగర్, మహేష్ యాదవ్, సత్యం యాదవ్, కాజా మ్యాప్, వెండర్, గిరి పృథ్వి, మంత్రి, మహిళా కానిస్టేబుల్ లు విజయ కుమారి, మౌనిక తదితరులను ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.