'కళారంగం'లోనూ డిజిటల్ కోర్సులు.. సంగీత, నృత్య పాఠాలకు యాప్
దిశ, ఫీచర్స్: ప్రపంచం అరచేతిలోనే ఇమిడిపోవడంతో ఇంటి నుంచే కొత్త నైపుణ్యాలు నేర్చుకునే..Online Learning Platforms For Arts And Music
దిశ, ఫీచర్స్: ప్రపంచం అరచేతిలోనే ఇమిడిపోవడంతో ఇంటి నుంచే కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది 'ఆన్‌లైన్ లెర్నింగ్'. స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్ సహా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు సైతం కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, బిజినెస్, ఆర్ట్, పర్సనల్ డెవలప్‌మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అయితే రెగ్యులర్ కోర్సులే కాక చిత్రలేఖనం, మూవీ, ఫొటోగ్రఫీ, కుట్లు, అల్లికలు, వ్యవసాయం, బేకింగ్ వంటి విభిన్న కోర్సుల అభ్యాసానికి కూడా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ వేదికగా నిలుస్తున్నాయి. కాగా ఇలాంటి అన్-అకాడమిక్ అంశాలపై ఆసక్తిగల ఎంతోమంది ఔత్సాహికులు.. పర్టిక్యులర్ సబ్జెక్ట్‌పై పట్టు సంపాదించేందుకు డిజిటల్ లెర్నింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. విద్యార్థులు పాఠ్యేతర కార్యకలాపాలు నేర్చుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుండగా.. 'కళారంగం'లోనూ డిజిటల్ కోర్సులు అందిస్తున్న ది బెస్ట్ ప్లాట్‌ఫామ్స్ వివరాలు మీ కోసం..
ఉడెమీ
అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో 'ఉడెమీ' ఒకటి. ఇందులో దాదాపు 50 మిలియన్ విద్యార్థులు వివిధ కోర్సులు నేర్చుకుంటున్నారు. 40 వేలకు పైగా ఉపాధ్యాయులు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ బోధిస్తున్నారు. సమగ్ర వివరణతో పవర పాయింట్ ప్రజంటేషన్ అందిస్తూనే ప్రతీ అంశంపై పీడీఎఫ్ మెటీరియల్‌తో పాటు వీడియో కంటెంట్ కూడా అందిస్తారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఆర్ట్, మ్యూజిక్, కోడింగ్ సహా 1000కి పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక డ్రాయింగ్ కోర్సుల విషయానికొస్తే.. 'ద సీక్రెట్స్ టు డ్రాయింగ్, ఆర్ట్ ఫండమెంటల్స్, బిల్డింగ్ కాన్ఫిడెన్స్ త్రూ డ్రాయింగ్, పెన్సిల్ డ్రాయింగ్, స్కెచింగ్, క్యారెక్టర్ డిజైన్, ఇల్‌స్ట్రేషన్' వంటి కోర్సులు నేర్పిస్తున్నారు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.
ఉడెమీ అందిస్తున్న మ్యూజిక్ కోర్సులు
ఇందులో 25కి పైగా మ్యూజిక్ కోర్సులు అందిస్తుండగా.. సబ్జెక్ట్ వైజ్‌గా కీబోర్డ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఎలా ప్లే చేయాలి? మ్యూజిక్ ఎలా రీడ్ చేయాలి? కంపోజ్ ఎలా చేయాలి? జాజ్ సంగీతం ఎలా ఉంటుంది? వంటి విషయాలు బోధిస్తారు.
* పియానో :
* గిటార్(బాస్, బ్లూస్, క్లాసికల్)
* మ్యూజిక్ థియరీ
* మ్యూజిక్ ప్రొడక్షన్, మిక్సింగ్
* సింగింగ్
* మ్యూజిక్ కంపోజిషన్
* డ్రమ్స్, వయోలిన్, ఫ్లూట్
* డీజే
* ఆడియో ప్రొడక్షన్, ఇంజనీరింగ్
స్కిల్ షేర్
స్కిల్‌షేర్‌లో దాదాపు 3 మిలియన్‌కు పైగా విద్యార్థులు నమోదై ఉన్నారు. ఇందులో ఇలస్ట్రేషన్, డిజైన్, ఫొటోగ్రఫీ, వీడియో, ఫ్రీలాన్సింగ్ సహా అనేక అంశాలతో కూడిన 25,000 కోర్సు వీడియోలున్నాయి. అంతేకాదు 20 నుంచి 60 నిమిషాల వ్యవధి గల కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. బేసిక్ లెస్సన్స్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకు కళ, సంగీతానికి సంబంధించి ఉత్తమ కోర్సులు అందిస్తోంది. లైఫ్‌స్టైల్, సృజనాత్మకత సబ్జెక్ట్‌లకు ఇది పేరుగాంచింది. ఇందులోని ఫైన్ ఆర్ట్స్ విభాగంలో 'అక్రలిక్ పెయింటింగ్, వాటర్ కలర్ పెయింటింగ్, ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ డ్రాయింగ్, బికమింగ్ క్రియేటివ్, అర్బన్ స్కెచింగ్' వంటి ఎన్నో విభిన్నమైన కోర్సులు ఆఫర్ చేస్తోంది.
* మ్యూజిక్ టెక్నాలజీ
* మ్యూజిక్ ఎడ్యుకేషన్, కంపోజిషన్
* మ్యూజిక్ ఫండమెంటల్స్
* సాంగ్ రైటింగ్
* అబెల్టన్ లైవ్
* పియానో, గిటార్
కోర్సెరా
ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, ప్రఖ్యాత సంస్థలతో 'కోర్సెరా' లింక్-అప్స్ కలిగి ఉంది. ఆయా యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్స్ సంపాదించాలనుకునే విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. కళ, సంగీతం సహా ఇతర విషయాలపై ప్రత్యేక కోర్సులను అందిస్తోంది. డిగ్రీ ప్రోగ్రామ్స్‌తో పాటు వ్యక్తిగత కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆన్-డిమాండ్ వీడియో లెక్చర్స్, ట్యుటోరియల్స్, గ్రూప్ డిస్కషన్స్ కూడా ఆఫర్ చేస్తోంది. అగ్రశ్రేణి ప్రొఫెసర్స్‌తో విద్యార్థులకు ఇంటరాక్షన్ కల్పిస్తుంది. ఆర్ట్ కేటగిరీలో 'మోడర్న్ అండ్ కంటెంపరరీ ఆర్ట్ అండ్ డిజైన్, హీలింగ్ విత్ ఆర్ట్స్, ఆర్ట్ అండ్ ఐడియాస్, ఆర్ట్ ఫర్ గేమ్స్' వంటి వినూత్న కోర్సులున్నాయి.
* సౌండ్ డిజైన్
* క్రియేటివ్ రైటింగ్
* పోయెట్రీ
* జాజ్
* మ్యూజిక్ బిజినెస్, మ్యూజిక్ ప్రొడక్షన్
* లిరిక్ రైటింగ్
* మ్యూజిషియన్‌షిప్
* ఇంట్రడక్షన్ టు క్లాసికల్ మ్యూజిక్
నాట్య
కేరళ, కన్హన్‌గాడ్‌కు చెందిన కళామండలం శివప్రసాద్ 2015 నుంచి 'నాట్య' అనే కళాసంస్థను నడుపుతున్నాడు. ఈతరానికి దగ్గర చేసేందుకు అదే పేరుతో వెబ్‌సైట్, యాప్ కూడా తీసుకొచ్చాడు. భారత్ నుంచే కాకుండా సుమారు 4 వేల మంది విదేశీ విద్యార్థులకు డిజిటల్ వేదికగా భరతనాట్యం, మోహినియాట్టం, కూచిపూడి, కర్ణాటక సంగీతం నేర్పిస్తున్నాడు. నాట్య కళల్లో సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నారు. ఇందులో లైవ్ క్లాసెస్‌తోపాటు రికార్డెడ్ లెస్సన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి మలయాళం, ఇంగ్లీష్, హిందీలో తరగతులు బోధిస్తున్నారు. కాగా మార్చి 27 నుంచి థియేటర్ రంగంలోకి కూడా 'నాట్య' ప్రవేశించినట్లు శివప్రసాద్ పేర్కొన్నాడు.
* ఇవేకాక లిండా(Lynda), ఉడాసిటీ(Udacity) తదిరత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఎన్నో సంగీత, నృత్య, ఆర్ట్ సంబంధిత క్లాసెస్ అందిస్తున్నాయి.