నాటిన మొక్కలను తొలగించి.. అసైన్డ్ భూమి కబ్జా!
దిశ, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి - Occupancy of assigned land in Janagama district
దిశ, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మాదారం గ్రామంలో సర్వేనెంబర్ 115 లో ఉన్న రెండు ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాకు గురైంది. అదే గ్రామానికి చెందిన రాజిరెడ్డి ఈ భూమిని ఆక్రమించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని ఆక్రమించడానికే భూమిలో ఉన్న చెట్లను తొలగించాడని గ్రామ సర్పంచ్ గుడి రాజిరెడ్డి నేతృత్వంలో గ్రామస్తులు తహశీల్దార్ అన్వర్, ఎస్ఐ వినయ్ కుమార్ లకు మంగళవారం ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణకు పాల్పడిన సదరు వ్యక్తి ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు నాటిన మొక్కలను తొలగించి భూమిని చదును చేశాడని గ్రామస్తులు మండిపడ్డారు.
ఉపాధి హామీ మొక్కలను తొలగించినందుకు అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఎంపీడీవో హసీన్ కు కూడా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణ దారులపై రెవెన్యూ, పోలీస్, మండల పరిషత్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో సర్పంచ్ తో పాటు గ్రామస్తులు నరసయ్య, శ్రీనివాస్, కుమార్ తదితరులు ఉన్నారు.