కల్లు దుకాణాల్లో తనిఖీలేవి..? కళ్ళు ముసుకున్న ఎక్సైజ్ శాఖ

దిశ, కామారెడ్డి రూరల్ : అసలే ఎండాకాలం.. పొద్దంతా కూలి చేసుకుని వచ్చి కునుకు తీయాలంటే కడుపులో.. Latest Telugu News..

Update: 2022-03-16 06:32 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : అసలే ఎండాకాలం.. పొద్దంతా కూలి చేసుకుని వచ్చి కునుకు తీయాలంటే కడుపులో చుక్క పడాల్సిందే. అంటే కల్లు దుకాణం గడప తొక్కాల్సిందే. కానీ వాళ్ళు తాగే కల్లు ఆరోగ్యానికి కీడు చేసేదని గుర్తించడం లేదు. మూస్తేదారులు తయారు చేసిన కల్తీ కల్లే వారికి శరణ్యం. కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నా ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎక్సైజ్ అధికారుల అండతోనే మూస్తే దారులు రెచ్చిపోతున్నారన్న విమర్శలు బహిరంగానే వినిపిస్తున్నాయి. అయినా అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తమ ఇంటి వాళ్ళు ఎవరైనా కల్తీకి బానిసలవుతున్నారా అనే ధోరణిలో అధికారులు వెళ్తున్నట్టుగా కనిపిస్తోందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మత్తు పదార్థాలతో కల్లును తయారు చేస్తూ మూస్తేదారుల జేబులు నింపుకుంటున్నారు. తద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అధికారులు మా వైపే ఉన్నారు మమ్మల్ని ఎవరేం చేస్తారు అన్న ధోరణిలో దూకుడుగా వెళ్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో కల్లు విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న మూస్తేదారులు కల్తీ కల్లు తయారీ అమాంతం పెంచారు. నిన్న మొన్నటి వరకు నామమాత్రంగా జరిగిన విక్రయాల కంటే ఈ మూడు నెలలు రెట్టింపు సాగనున్నాయి. దాంతో కల్తీ కల్లు దందా జోరందుకుంది. పత్రికల్లో కల్తీ కల్లుపై వార్తలు రాగానే మమ్మల్ని ఎందుకు లాగుతారు సార్ అంటూ పత్రికల వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్న ఎక్సైజ్ అధికారులు ప్రజల ప్రాణాలను కాపాడటానికే తాము ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారు.

మూస్తేదారుల నుంచి మామూళ్లు దండుకుంటూ వారి వ్యాపారానికి పరోక్షంగా అధికారులే సహకరిస్తున్నారన్న అపవాదు ఎక్సైజ్ శాఖ మూటగట్టుకుంటోంది. ఆ అపవాదు తొలగించే ప్రయత్నం చేయకపోవడంతో ఆ ఆరోపణలు నిజమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లో వందలాది కల్లు దుకాణాలు ఉన్నాయి. ఏ ఒక్క దుకాణంలో కూడా ఒరిజినల్ కల్లు లభించిన దాఖలాలు లేవు. మందు కల్లుకు అలవాటు పడుతున్న సామాన్య ప్రజలు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. గతంలో కొన్ని గ్రామాల్లో దుకాణాలు మూసివేస్తే కల్తీ కల్లుకు బానిసలుగా అమాయక ప్రజలు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఆసుపత్రుల పాలైన దాఖలాలు అనేకం.

ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు క్షేత్రస్థాయిలో కల్లు దుకాణాల్లో నిజాయితీగా తనిఖీలు చేపడితే ఒక్క దుకాణం కూడా కొనసాగే అవకాశం లేదు. తనిఖీలకు వెళ్లే సమయంలో మూస్తేదారులు ఇచ్చే కల్లును కాకుండా సాధారణ ప్రజలు దుకాణంలో కూర్చుని తాగే కల్లును శాంపిల్ తీసుకెళ్తే ఖచ్చితంగా కల్తీ కల్లే అని నివేదికలో తేలుతుంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని, కల్తీ కల్లు విక్రయించే దుకాణాలపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News