డబ్బుల కోసం అతని ప్రాణం తీశాడు..
దిశ, నిజామాబాద్ రూరల్: ఈ నెల 29న నిజామాబాద్ జిల్లా - Nizamabad district Rams murder case has been solved by the police
దిశ, నిజామాబాద్ రూరల్: ఈ నెల 29న నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం మల్కాపూర్ తండాలో జరిగిన రాములు హత్య కేసును రూరల్ సీఐ నరేష్ తన సిబ్బందితో ఛేదించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రూరల్ మండలం మల్కాపూర్ తండాకు చెందిన రాములు అతని కోడలు కోట భాయ్ తమ వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న రాములుని చూసిన అగంతకుడు కంచర్ల సతీష్ .. రాములు దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడానికి పన్నాగం పన్నాడు. రాములు తన కోడలితో వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తుండగా.. సతీష్ తను పన్నిన పన్నాగం ప్రకారం రాములు దగ్గరికి వెళ్లి కష్టపడి కట్టెలు కొట్టానని ఆ మోపులు తల పైకి ఎత్తమని కోరాడు.
దీంతో రాములు అతనితో కలిసి వెళ్ళాడు. ఈ క్రమంలో రాములుని పక్కనే ఉన్న చెరువు గట్టుకు తీసుకెళ్లి డబ్బులు లాక్కుని ప్రయత్నించగా ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దీంతో రాములు మెడలో ఉన్న రుమాలు(టవల్)తో గొంతుకు గట్టిగా బిగించడంతో ఊపిరాడక రాములు మృతి చెందాడు. దీంతో సతీష్ రాములుని హత్య చేసి చెరువులో తోసేసాడని సీఐ నరేష్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రూరల్ మండలం ధర్మారం గ్రామ శివారులో పాత సీసాలు, పాత సామాన్లు సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్న కంచర్ల సతీష్ పై అనుమానం వచ్చి విచారించగా తానే డబ్బుల కోసం రాములును హత్య చేశాడంటూ ఒప్పుకున్నాడని సీఐ వివరించారు.