సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ రంజిత్ రెడ్డి

దిశ, చేవెళ్ల : హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిలో భాగంగా హైదరాబాద్..latest telugu news

Update: 2022-03-24 13:26 GMT

దిశ, చేవెళ్ల : హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిలో భాగంగా హైదరాబాద్ శివారులోని అప్పా(తెలంగాణ పోలీసు అకాడమీ) నుంచి వికారాబాద్ జిల్లా మన్నెగూడ వరకు ఉన్న 46 కిలోమీటర్ల రహదారి నిర్మాణం టెండర్లను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్ హెచ్ ఏఐ) ఖరారు చేసింది. ఈ టెండర్లను ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) దక్కించుకుంది.

టెండర్‌కు సంబంధించిన లెటర్ ఆఫ్ అవార్డ్(ఎల్వోఏ)ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు మేఘా సంస్థకు అందజేశారు. మొత్తం రూ.956 కోట్లతో నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. ఇందులో రోడ్డు నిర్మాణానికి రూ.786 కోట్లను కేటాయించారు. ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి టెండర్లు పూర్తి కావడంతో మరో రెండు మాసాల్లో పనులు ప్రారంభం అవుతాయి. సీఎం కేసీఆర్ ఈ రహదారి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. గత మూడేళ్లుగా నిత్యం రహదారి నిర్మాణంపై కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నారు. అప్పా నుంచి మన్నెగూడ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణంకు 80 శాతం భూసేకరణ కూడా పూర్తి చేశారు. ఈ మార్గంలో మొత్తం 18 అండర్ పాస్‌లు మొయినాబాద్, చేవెళ్ల వద్ద బైపాస్ రోడ్డులను నిర్మిస్తారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే చేవెళ్లతో పాటు వికారాబాద్ జిల్లా ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.

పనులు వేగవంతంగా పూర్తి కానున్నాయి: ఎంపీ రంజిత్ రెడ్డి

అప్పా-మన్నెగూడ నాలుగు లైన్ల రోడ్డు పనులను టెండర్ల ప్రక్రియలో మెగా కంపెనీ సొంతం చేసుకుంది. దేశంలో అనేక పెద్ద ప్రాజెక్టులను చేపట్టి నాణ్యమైన, వేగవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్న మెగా కంపెనీకి వచ్చినందున ఈ రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి పని చేయడానికి చేవెళ్ల ఎంపీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా నా చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

Tags:    

Similar News