గ్రూప్స్, DSC పరీక్షల వాయిదాపై MP చామల కిరణ్ రెడ్డి క్లారిటీ

గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలను దాదాపు లక్ష మంది అభ్యర్ధులు రాయబోతున్నారని, కేవలం 5 వేల మంది కోసం ప్రభుత్వం నిర్ణయం

Update: 2024-07-09 15:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలను దాదాపు లక్ష మంది అభ్యర్ధులు రాయబోతున్నారని, కేవలం 5 వేల మంది కోసం ప్రభుత్వం నిర్ణయం మార్చుకోలేదని ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కువ శాతం మంది నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నారు. కొంత మందిని ప్రతిపక్ష పార్టీల నేతలు నిరుద్యోగులను రెచ్చ కొడుతున్నారన్నారు. ఇది సరైంది కాదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ట్రాప్‌లో పడొద్దని నిరుద్యోగులను కోరారు. గతంలో కేసీఆర్ ప్రజా స్వామ్య వ్యతిరేక పాలన చేశారని, బీజేపీ ఐటీ, ఈడీలతో బెదిరించి ఎమ్మెల్యేలను చేర్చుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే వంద రోజుల్లో అమలు చేశామన్నారు.

కేసీఆర్ హయంలో చీకటి పాలన జరిగిందని, రాష్ట్రం లో ఎంత అప్పు ఉన్నదనేది..? ఇప్పటికీ స్పష్టత రాలేదన్నారు. అన్ని లెక్కలు వేసుకుంటూ, రాష్ట్రాన్ని సంపూర్ణంగా పాలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 18 గంటల పాటు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ మీద విరక్తి కలిగి చాలా మంది బీఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి చేరుతున్నారన్నారు. కొత్తగాచేరినోళ్లకు మంత్రి పదవి రాదని స్వయంగా సీఎం ప్రకటించినా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి చేరుతున్నారన్నారు. గతంలో కేసీఆర్ కనీసం మంత్రులను కూడా కలవలేదని, కానీ తమ సీఎం క్షేత్రస్థాయి లీడర్లను కూడా డైలీ కలుస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ కేవలం 100 సీట్లకే పరిమితం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


Similar News