చేనేత కార్మికుల్లో బడ్జెట్ భరోసా నింపింది: ఎల్.రమణ

దిశ, చౌటుప్పల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు.

Update: 2022-03-08 13:19 GMT

దిశ, చౌటుప్పల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలంటూ పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎల్.రమణ మాట్లాడుతూ... చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ని రద్దు చేయాలని కోరారు. చేనేత వస్త్రాలను జీరో జీఎస్టీ పరిధిలోకి తీసుకు రాకుంటే జాతీయ స్థాయిలో నేత కార్మికులతో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయ రంగంతో పాటు విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసిందని అన్నారు.

నూతనంగా నేతన్నలకు బీమా పథకంతో చేనేత కార్మికులకు భరోసా నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో వాటన్నిటినీ విజయవంతం చేస్తూ ముందుకు వెళుతున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ బడ్జెట్‌లో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, పిల్లలమర్రి శ్రీనివాస్, చేనేత కార్మిక సంఘం నాయకులు కందగట్ల భిక్షపతి, గర్దాసు బాలయ్య, బడుగు మాణిక్యం, యర్రమాద వెంకన్న, శ్రీమన్నారాయణ,రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News