కాలనీలో రెండు చిరుతపులుల సంచారం.. ఆందోళనలో ఏపీ జెన్కో ఉద్యోగులు
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట ఏపీ జెన్కో కాలనీలో తెల్లవారుజామున రెండు చిరుతపులుల సంచారం కలకలం రేపింది.
దిశ, శ్రీశైలం ప్రాజెక్ట్ : నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట ఏపీ జెన్కో కాలనీలో తెల్లవారుజామున రెండు చిరుతపులుల సంచారం కలకలం రేపింది. చిరుతపులుల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ దృశ్యాలను చూసిన జెన్కో ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులకు అటవీ శాఖ అధికారులు సూచనలు చేశారు. గతంలో కూడా పలుమార్లు సున్నిపెంట కాలనీలో చిరుతపులుల సంచరించాయి. రెండు నెలల క్రితం జెన్కో కాలనీ సమీపంలోని ఓ ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించి వారి పెంపుడు కుక్కను సైతం చంపేసింది. తాజాగా మరోసారి రెండు చిరుతపులుల సంచారం కలకలం రేపుతుంది. నల్లమలకు సున్నిపెంట సమీపం గ్రామం కావడంతో తరచూ ఊర్లోకి చిరుతపులులు రావడం పరిపాటిగా మారింది. రాత్రి వేళలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.