ప్రాణం ఖరీదు రూ. 2లక్షలు.. బాధితులతో ఏమ్మెల్యే అనుచరుల బేరసారాలు

దిశ, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతూ సినిమా.. Latest Telugu News..

Update: 2022-03-18 15:32 GMT

దిశ, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతూ సినిమాను తలపిస్తోంది. ఈ వ్యవహారంలో రోడ్డు ప్రమాదానికి కారణమైన కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటం, ప్రమాదానికి కారణమైన వ్యక్తులు పారిపోవడం, ఆ కారు నడిపింది ఎమ్మెల్యే కొడుకేనని సోషల్ మీడయాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు రావడం జరిగింది. ఈ విషయం తెలియడంతో దుబాయ్‌లో ఉన్న ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. కారు నడిపింది తన కొడుకు కాదని, తన సోదరుడి కుమారుడని ఆయన తెలిపారు. ఇంతలోనే ప్రమాదానికి గురైన బాధితులు నిమ్స్ ఆస్పత్రి నుండి పరారీ అవ్వడం, వంటి సంఘటనలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి.

అసలేం జరిగిందంటే..

గురువారం రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదమ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం 1 వైపుకు వెళ్తున్న కారు అధిక వేగంతో వచ్చి రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టింది.దీంతో రోడ్డు పక్కనే ఉంటూ బెలూన్లు, ఇతర ఆట వస్తువులు అమ్ముకునే మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మా బోస్లే అనే మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. అధిక వేగంతో కారు డీ కొట్టడంతో కాజల్ చౌహాన్ చేతుల్లో ఉన్న రెండున్నర నెలల బాబు అశుతోష్ కిందపడిపోయాడు. ఆ సమయంలో బాబుకు దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళలు అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు . సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలను చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పంజాగుట్ట నిమ్స్‌కు తరలించారు.


ఎమ్మెల్యే ఎంట్రీ

ఇదిలా ఉండగా కారు నడిపిన డ్రైవర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాటు కారు నడిపింది ఎమ్మెల్యే షకీల్ కుమారుడని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఎమ్మెల్యే షకీల్ సీన్‌లోకి ఎంటార్ అయ్యారు. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంతో తనకు, తన కొడుకుకు సంబంధం ఉందన్న వార్తలలో నిజం లేదని, తన సోదరుడు మిర్జా కొడుకు కారు నడిపాడని వీడియోలో పేర్కొన్నాడు. ప్రమాదంలో రెండు నెలల పసికందు మృతి చెందటం దురదృష్టమని, ప్రమాదంలో చనిపోయిన బాబు కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. నిజానిజాలు తెలుసుకోవడం కోసం పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ఆధారాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీడియోలో కోరారు.

నిమ్స్ నుంచి బాధితుల మాయం

ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాజల్ చౌహాన్‌తో పాటు మిగిలిన ఇద్దరు మహిళలు నిమ్స్ ఆస్పత్రి నుంచి వైద్యులకు చెప్పకుండా వెళ్లిపోవవడం కలకలం సృష్టించింది. అయితే ఈ వ్యవహారాన్ని పెద్దది కాకుండా ఇంతటితో ముగించాలని ఎమ్మెల్యే షకీల్ సూచనల మేరకు కారు నడిపిన వ్యక్తి బంధువులు నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి కాజల్ చౌహాన్‌ను కలిశారని, వారికి రూ.2 లక్షలు ఇచ్చి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని, వెంటనే హైదరాబాద్ వదిలి వెళ్లిపోవాలని బాధితులతో సెటిల్ మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో వారంతా మహారాష్ట్రలోని సొంతురికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News