Raja Singh: కేంద్ర మంత్రి పదవిపై కన్నేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ..?

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : గోషామహల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే

Update: 2022-04-07 11:53 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : గోషామహల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే టీ. రాజాసింగ్.. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గం మార్పు కోరుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి ఆయన 2014 , 2018 లో వరుసగా గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలిచి పార్లమెంట్ కు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారనేది చర్చనీయాంశమైంది. ప్రస్తుత అసెంబ్లీకి 2018 లో జరిగిన ఎన్నికల్లో ముందుగా బీజేపీ నుంచి గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగే కావడం గమనార్హం.

అనంతరం రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర నాందేడ్‌లలో రాజాసింగ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో గత ఎన్నికలలోనే ఆయన నాందేడ్ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. దీనికి బలం చేకూర్చేలా ఆయన తరచుగా నాందేడ్ పర్యటనలు కూడా చేశారు. అయితే కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్నప్పటికీ రాబోయే ఎన్నికల కోసం ఆయన ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారు.

ఆ రెండు పార్లమెంట్ స్థానాలలో..

మహారాష్ట్రలోని నాందేడ్, తెలంగాణలోని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలలో ఏదైనా ఒక చోటు నుండి పోటీ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరాటపడుతున్నట్లుగా సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఈ రెండింటిలో గెలుపు అవకాశాలు ఎక్కడ అధికంగా ఉన్నాయనేది గుర్తించే పనిలో ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జీ కిషన్ రెడ్డి అనంతరం.. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా ఎంపీగా గెలిస్తే తనకు కూడా కేంద్రంలో మంత్రిగా అవకాశం దక్కుతుందనే ఆలోచనతో రాజాసింగ్ ఉన్నారు.

ఆ రెండే ఎందుకు..?

నాందేడ్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నారనే విషయంలో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. సికింద్రాబాద్ నుండి సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి ఉండగా.. అక్కడి నుంచి పోటీ చేయలేని పరిస్థితి ఉంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం ను ఓడించడం అంత సులువు కాదు. దీంతో ప్రత్యామ్నాయంగా హిందువుల ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల వైపు ఆయన దృష్టి సారించారు. తెలంగాణ అసెంబ్లీలో కేవలం ఇప్పుడు మూడు స్థానాలతో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తీవ్రంగా శ్రమించాలనేది రాజాసింగ్ ముందుగానే గుర్తించారు.

అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మరోమారు బీజేపీకే అధికంగా విజయావకాశాలు ఉన్నాయని ఆయన నమ్ముతున్నారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాలలో ఏదైనా ఒక స్థానం నుంచి పోటీ చేస్తే విజయం సాధిస్తాననే ధీమాను అనుచరుల వద్ద రాజాసింగ్ వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని రాజాసింగ్ నమ్ముతున్నారు. మరి పార్టీ అగ్రనేతలు ఆయనకు ఎంపీగా ఎంత వరకు అవకాశం ఇస్తారనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Tags:    

Similar News