'న్యాయం కోసం వస్తే అరెస్టు చేస్తారా.. మీపై ప్రతీకారం తీర్చుకుంటా': ఎమ్మెల్యే

దిశ, దుబ్బాక: న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వస్తే అన్యాయంగా అరెస్టు చేయడం ఏంటని,- LATEST TELUGU NEWS

Update: 2022-03-31 14:02 GMT

దిశ, దుబ్బాక: న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వస్తే అన్యాయంగా అరెస్టు చేయడం ఏంటని,తనపై దురుసుగా ప్రవర్తించిన ప్రతి పోలీసుపై చట్టపరంగా ప్రతీకారం తీర్చుకుంటానని ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చరించారు. రక్షణ కల్పించని పోలీసులపై వెంటనే పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలంటూ గురువారం మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ధర్నాకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు సీఐ, ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ.. బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కావాలనే పోలీసులు టీఆర్ఎస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గుడికందుల మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవానికి వస్తున్నానని చెప్పినప్పటికీ పోలీసులు రక్షణ కల్పించకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులతో పోలీసులు కలిసి దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అరాచకంగా అరెస్టు చేయడం హేయమైనా చర్య అన్నారు.

తప్పు చేసిన పోలీసులతోనే అరెస్టు చేసి తనను అవమానపరిచే విధంగా పోలీసులు వ్యవహరించారన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలపడానికి పోలీస్ స్టేషన్‌లో కూర్చుంటే పోలీసులు అమర్యాదగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. బీజేపీ కార్యకర్తలను కాళ్లు చేతులు పట్టి ఈడ్చుకుంటూ వెళ్లడం బాధాకరమన్నారు. దుబ్బాక నియోజకవర్గం బీజేపీ నాయకులు మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని సీపీ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీఆర్ఎస్ నాయకులకు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను పోలీసు వాహనంలో ఎక్కించడానికి ఏసీపీ దేవా రెడ్డితో పాటు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆయన ససేమీరా అనడంతో బలవంతంగా వాహనంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సుమారు నాలుగు గంటలపాటు పోలీస్ స్టేషన్‌లో ధర్నా చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు‌తో పాటు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News