దిశ, కంటోన్మెంట్: ఆత్మ గౌరవానికి ప్రతీకగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర, ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గురువారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ మారేడ్‌పల్లిలో నిర్మించిన 468 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మొహామ్మద్ ఆలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్నలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు అంటుంటారని, అలా కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించడంతోపాటు, పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిండ్లకు ఆర్థిక సాయం అందిస్తున్నారని వివరించారు. గత పాలకులు చిన్న ఇండ్లను నిర్మిస్తే.. తమ ప్రభుత్వం ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు పడులక గదుల ఇండ్లు బ్రహ్మండంగా ఉన్నాయని లబ్దిదారులు సంబురంగా చెప్తున్నారని తెలిపారు. ఇంతకు మించిన తృప్తి రాజకీయంలో దేనితో కూడా రాదన్నారు. లబ్దిదారుల మాటలతో కడుపు నిండినంతా పనైందన్నారు.
మీ అందరూ కోటీశ్వర్లు..
రాజధాని నడిబొడ్డున ఉన్న ఓల్డ్ మారేడ్ పల్లిలో అత్యంత విలువైన 5 ఎకరాల 18 గుంటల స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామని తెలిపారు. ఈ భూమి ధర గజానికి రెండున్నర లక్షలు ఉంటుందన్నారు. రూ. 350 కోట్ల విలువ చేసే ఈ స్థలానికి హౌసింగ్ బోర్డు నుంచి జీహెచ్ఎంసీకి అప్పగించిన్నట్లు తెలిపారు. ఇంతటి విలువైన స్థలంలోనే ఇక్కడున్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఈ ఇల్లును ఒక ప్రవేటు బిల్డర్ నుంచి కొనుగోలు చేసినట్లయితే రూ. 70 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు అవుతోందని తెలిపారు.
కడుపు నిండినంతా..
డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారుల ఆనందం చూస్తుంటే.. కడుపు నిండినంతా పనైంద అని కేటీఆర్ అన్నారు. మీ అందర్నీ కేసీఆర్ కోటీశ్వర్లను చేశారు. ఈ ఇండ్లను అమ్మే ప్రసక్తే లేదన్నారు. ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనని తెలియజేశారు. ఆ మేరకు ఇండ్ల నిర్మాణం జరిగింది. ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఉదయం ట్విట్టర్‌లో ఈ ఫోటోలు పెడితే మిగతా రాష్ట్రాల ప్రజలు విపరీతంగా స్పందింస్తున్నారు. తమకు కూడా ఇలాంటి ఇండ్లు కట్టించే సీఎం ఉంటే బాగుండు అని అంటున్నారు. రూపాయి కూడా తీసుకోకుండా ఇలాంటి ఇండ్లు కట్టిస్తున్నారా అని సీఎం కేసీఆర్‌ను ప్రశంసిస్తున్నారు. విద్యుత్, నీటి సరఫరా ఏర్పాటు చేశామన్నారు. ఈ కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలి అని కేటీఆర్ సూచించారు.
ఎమ్మెల్యే జి.సాయన్న మాట్లాడుతూ.. లబ్దిదారులకు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తామని, ఏవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఈ నెల 14వ తేదీన బస్తీలో మీటింగ్ పెట్టి మిగితా లబ్ధిదారులకు ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు. ఇంత చక్కటి ఇండ్లను కట్టించిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభీ వాణి దేవి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, టీఎస్ ఎంఎస్ ఐడీ చైర్మన్ డాక్టర్ ఏర్రోళ్ల శ్రీనివాస్, బెవరేజెస్ చైర్మన్ గజ్జెల నగేష్, కార్పొరేటర్ దీపిక తదితరులు పాల్గొన్నారు.