"కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకావిష్కరణలో మంత్రి కేటీఆర్
తెలంగాణ సాధన కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించడంతో పాటు తన శక్తియుక్తులన్నీ ధారపోసి, చివరికి ఆమరణ నిరాహారదీక్షతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు.
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సాధన కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించడంతో పాటు తన శక్తియుక్తులన్నీ ధారపోసి, చివరికి ఆమరణ నిరాహారదీక్షతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ప్రగతి భవన్ లో మంగళవారం మనోహర్ చిమ్మని రాసిన "కేసీఆర్ - ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్" పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఆరు దశాబ్దాలుగా రగులుతున్న తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన అసామాన్య వ్యక్తి, ఉద్యమశక్తి, దార్శనికుడు, వ్యూహకర్త, రాజకీయవేత్త కేసీఆర్ అన్నారు. జాతీయరాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం తనదైన శైలిలో సంచలనాలు సృష్టించబోతున్న మనోహర్ పుస్తకం రాయడం అభినందనీయమన్నారు. దేశంలోనే తెలంగాణను ఎన్నో రంగాల్లో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని, ఇంత చేస్తున్నా కేసీఆర్ ను కొందరు దూషించడం, అవమానించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి బైరి, దిలీప్ పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
తెలంగాణ అభివృద్ధికి ముఖరా గ్రామమే ముఖచిత్రం అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 'ప్రతీ ఇంటికి సంక్షేమం-ప్రతీ ఇంటికి కేసీఆర్' పేరుతో ముఖరా గ్రామంలో చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి చేస్తున్న వినూత్న ప్రచారం బాగుందని కితాబు ఇచ్చారు. ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందిన లబ్దిదారుల ఇంటిముందు ఆ వివరాలతో కూడిన పోస్టర్ ను ఉంచడం అభినందనీయమన్నారు. ఇప్పటివరకు సుమారు 34 కోట్ల రూపాయల నిధులను ముఖరా అభివృద్ధికి ప్రభత్వం మంజూరు చేసిన వివరాలను గ్రామంలో ఫ్లెక్సీలా ఉంచడం ప్రశంసనీయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాష్ తదితరులు పాల్గొన్నారు.