చింతమడకలో.. కన్నుల పండుగగా పట్టాభి రాముని కళ్యాణం
దిశ, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం - Minister Harish Rao attends special pujas for Pattabhi Ramu's wedding function at Chintamadaka village in Siddipet district
దిశ, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో పట్టాభి రాముడు కొలువుదీరాడు. శ్రీరామనవమి సందడి చింతమడకలో వారం రోజుల ముందుగానే మొదలు కాగా ఆదివారం శ్రీ పట్టాభి రాముని విగ్రహ ప్రతిష్ట కలశస్థాపన కార్యక్రమాలు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన పట్టాభి రాముని కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని స్వామివారికి మంత్రి హరీష్ రావు పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పట్టాభిరాముని ఆలయం అత్యంత సుందరంగా నిర్మించుకున్నట్లు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులు కేసీఆర్ కృషితో కాళేశ్వరం నీటితో గ్రామాల్లోని చెరువులు కుంటలు జలకళను సంతరించుకున్నాయి అన్నారు. ఓవైపు గ్రామ పునర్నిర్మాణం మరోవైపు ఆధ్యాత్మిక శోభతో చింతమడక గ్రామం పండుగ శోభను సంతరించుకుందన్నారు. 3 కోట్లతో శివాలయం పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చింతమడక గ్రామ సర్పంచ్ హంస కేతన్ రెడ్డి.. మంత్రి హరీష్ రావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూడ చైర్మన్ రవీందర్ రెడ్డి ప్రజా ప్రతినిధులు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.