కిడ్నీ టెస్ట్‌కు పోర్టబుల్ డివైజ్.. ఆస్ట్రేలియన్ సైంటిస్టుల ఆవిష్కరణ

దిశ, ఫీచర్స్ : శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలకపాత్ర. రోజుకు దాదాపు 200 లీటర్ల శుద్ధి సామర్థ్యమున్న కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి ముఖం, కాళ్లు ఉబ్బినట్లుగా కనిపించడం సహా ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది..Latest Telugu News

Update: 2022-07-12 07:28 GMT

దిశ, ఫీచర్స్ : శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలకపాత్ర. రోజుకు దాదాపు 200 లీటర్ల శుద్ధి సామర్థ్యమున్న కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి ముఖం, కాళ్లు ఉబ్బినట్లుగా కనిపించడం సహా ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో శ్వాస సమస్యలు తలెత్తుతాయి. అయితే కిడ్నీ వ్యాధి లక్షణాలు అంత త్వరగా బయటకు కనిపించవు. అందుకే దీన్ని 'సైలెంట్ కిల్లర్'గా పిలుస్తుంటారు. మూత్ర పరీక్ష(యూరిన్ రొటీన్, యూరిన్ అల్బుమిన్-టు-క్రియాటినిన్ నిష్పత్తి, సీరం క్రియేటినిన్) ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు కానీ దీనికి కూడా సమయం పట్టవచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆవిష్కరించబడిన ఒక కొత్త పోర్టబుల్ డివైజ్.. రిమోట్ కమ్యూనిటీల్లో కిడ్నీ పరీక్షను ఆన్‌సైట్‌లో నిర్వహించేందుకు తోడ్పడనుంది.

ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కిడ్నీ టెస్ట్ కోసం ఓ పోర్టబుల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. 'అగ్రిగేషన్ ఇండ్యూస్డ్ ఎమిషన్ బయోసెన్సార్‌'గా పిలవబడే ఈ గాడ్జెట్‌ ఒక కాంపాక్ట్ వెర్షన్. దీంట్లో మైక్రోప్రాసెసర్, డిజిటల్ కెమెరా, 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే సహా నిర్దిష్ట కాంతి తరంగదైర్ఘ్యాన్ని విడుదల చేసే మల్టీపుల్ లెడ్ లైట్స్‌ ఉన్నాయి. మొదటగా రోగి మూత్ర నమూనాకు లైట్-సెన్సిటివ్ కెమికల్ రియాజెంట్‌ని జోడించి, దాన్ని పోర్టబుల్ డివైజ్‌లో ప్లేస్ చేయడం ద్వారా టెస్టింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మూత్రం లెడ్ లైట్‌కు గురైనప్పుడు రియాజెంట్ ప్రతిస్పందించి అల్బుమిన్‌ను మెరిసేలా చేస్తుంది. ఈ మేరకు మూత్రంలో అల్బుమిన్ స్థాయిలకు అనుగుణంగా ఫ్లోరోసెన్స్ తీవ్రతను కొలిచేందుకు కెమెరా ఉపయోగపడుతుంది. ఒకవేళ అల్బుమిన్ స్థాయిలు ఎక్కువుంటే మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని నిర్ధారణ అవుతుంది.

'దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న రోగులు ఆస్పత్రి లేదా క్లినిక్‌ను క్రమం తప్పకుండా సందర్శించాల్సిన అవసరాన్ని ఈ పోర్టబుల్ పరికరం తగ్గిస్తుంది. అంతేకాదు ఇది కిడ్రీ డిసీజ్‌ను ముందస్తుగా గుర్తించడంలోనూ తోడ్పడుతుంది. ఈ పరికరం వల్ల ఎంతోమంది ప్రాణాలు రక్షించే అవకాశముంది' అని ప్రొఫెసర్ కరెన్ రేనాల్డ్స్ పేర్కొన్నాడు. ఈ పరిశోధనకు సంబంధించిన అధ్యయన వివరాలు మెటీరియల్స్ కెమిస్ట్రీ ఫ్రాంటియర్స్ జర్నల్‌లో ఇటీవలే ప్రచురించబడ్డాయి.


Similar News