సౌతిండియాలో హైదరాబాద్ నెం.1.. వాటిపై కొండా విశ్వేశ్వర రెడ్డి సంచలన ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో పచ్చదనం పెరిగిందని, తద్వారా భారీగా కాలుష్యం తగ్గిపోయిందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే, 'IQAir's' విడుదల చేసిన నివేదిక మాత్రం హైదరాబాద్‌లో భారీగా కాలుష్యం పెరిగిందని పేర్కొంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో హైదరాబాద్ దక్షిణ భారతదేశంలోనే మొదటి కాలుష్య నగరంగా నిలిచింది. అయితే, ప్రపంచంలోని కాలుష్య రాజధానుల్లో న్యూ ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. నివేధిక వెలువడిన క్రమంలో ఢిల్లీలో వాయు కాలుష్యం వలన ఏర్పడిన పరిస్థితులపై తిరిగి చర్చ జరుగుతోంది. భయంకరంగా గాలి నాణ్యత పడిపోవడంతో ఢిల్లీ వాసులు పడిన ఇబ్బందులు, ఇంట్లో కూడా మాస్కు ధరించడం వంటి ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. అయితే, ఇదే తరహాలో హైదరాబాద్ మహానగరం కూడా కాబోతుందా అంటే.. నిపుణులు అవుననే చెబుతున్నారు.
హైదరాబాద్‌లో రోడ్డెక్కే వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోవడం, ఫ్యాక్టరీల నుంచి విష వాయువులు వెలువడటం, కాలం చెల్లిన వాహనాలు చలామని కావడం వంటివి నగరాన్ని మరింత కాలుష్యం చేసేందుకు కారకాలుగా మారుతున్నాయి. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నా.. ఆశించినంతగా ఫలితాలు రావటం లేదని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో దక్షిణ భారతదేశంలోనే కాలుష్య నగరంగా మారింది. అయితే, దీనిపై ట్విట్టర్ వేదికగా పలువురు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా నగరాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా ప్రజలకు వాయు నాణ్యతను అందించలేకపోతున్నాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. '' మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన ఎస్టీపీలు సామర్థ్యం మేరకు పనిచేయడం లేదు. నగరంలోని సరస్సులన్నీ మురుగు నీటితోనే నిండిపోయాయి. నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జనను నియంత్రించేందుకు ప్రభుత్వం సరైన ఏర్పాటు చేయలేదని, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన 4వేల టాయిలెట్స్ బాక్సులు మాయమయ్యాయి. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం కూడా తగ్గలేదు.'' అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే.. హైదరాబాద్ కూడా మరో ఢిల్లీ అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు.