తెలంగాణ కేబినెట్‌లోకి కల్వకుంట్ల కవిత?
ఉగాది వేడుకల్లో భాగంగా శనివారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన పంచాగ పఠనంలో బాచుపల్లి శర్మ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఉగాది వేడుకల్లో భాగంగా శనివారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన పంచాగ పఠనంలో బాచుపల్లి శర్మ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్టీలో యాక్టీవ్‌గా పనిచేసే మహిళలకు మంచి అవకాశాలు దక్కుతాయని ఆయన తెలిపారు. దీంతో కల్వకుంట్ల కవితకు కేబినెట్‌లో స్థానం దక్కనుందని ఇండైరెక్ట్‌గా సంకేతం ఇచ్చారని పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. మరో వైపు రాష్ట్రపతి పీఠం మహిళకే దక్కుతుందని వెల్లడించారు. ఇక పార్టీ మారాలనుకునే నేతలకు గడ్డుకాలమే అంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. దేశమంతా సీఎం కేసీఆర్‌పైనే దృష్టి సారించే పరిస్థితి వస్తుందని వివరించారు. ఈ వ్యాఖ్యలు చేసింది బాచుపల్లి సంతోష్ కుమార్ శర్మే అయినా.. పలికించింది కేసీఆరే అనే చర్చలు జోరందుకున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: ఉగాది వేడుకలు ప్రగతి భవన్ వేదికగా శనివారం నిర్వహించారు. ఇందులో పంచాంగ పఠనం చేసిన బాచుపల్లి సంతోష్ కుమార్ శర్మ అనేక సంచలన విషయాలను ప్రస్తావించారు. దేశంలో అత్యున్నత స్థానంలో మహిళ కొలువుదీరుతారని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో యాక్టీవ్‌గా పాల్గొంటున్న మహిళకు అన్నీ అనుకూల పరిణామాలే ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంత్రివర్గంలో స్థానం లభించే ఛాన్స్ ఉందని పరోక్ష సంకేతాన్ని ఇచ్చారు. కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రస్తావన బలం చేకూర్చేలా ఉండడం గమనార్హం. పార్టీలు మారే వ్యక్తులకు గడ్డుకాలమేనని బాచుపల్లి శర్మ తన పంచాంగ పఠనంలో ప్రస్తావించారు. కేసీఆర్ తన మూడో నేత్రంతో నేతల కదలికలను పసిగడుతున్నారన్న హెచ్చరికనూ చేశారు.
మాయవతిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు..
మాయావతి రాష్ట్రపతి రేసులో ఉన్నారని, ఆమెకు అవకాశాలు ఎక్కువేనని జాతీయ స్థాయిలో వార్తలు వినిపించాయి. కానీ, తనకు అలాంటి కోరికలు లేవంటూ మాయావతి చెప్పుకొచ్చారు. తాజాగా.. ఉగాది పంచాంగ పఠనంలో పరోక్షంగా మాయావతిని ఉద్దేశించి బాచుపల్లి శర్మ వ్యాఖ్యలు చేసినట్టు అనిపిస్తున్నది. రాష్ట్రంలో రాజకీయంగా యాక్టీవ్‌గా ఉన్న మహిళలకు మెరుగైన అవకాశాలు ఉంటాయని కవితను ఉద్దేశించి ప్రస్తావించినట్టు గులాబీ నేతలు భావిస్తున్నారు. ఇంటా బయటా వారే కీలకం అనే కామెంట్ కూడా శర్మ చేయడంతో ఇటీవల కాశీ, ముంబై, ఢిల్లీ, రాంచీ లాంటి టూర్‌లన్నీ దానికి ఇండికేషన్ అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
పార్టీ మారొద్దని హెచ్చరిక
దాదాపుగా స్టేజ్ మేనేజ్డ్ తరహాలో జరిగిన ఉగాది పంచాంగ పఠనంలో బాచుపల్లి శర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సరికొత్త చర్చలకు దారితీశాయి. పార్టీ మారాలనుకునేవారికి కాలం కలిసిరాదని, గడ్డుకాలమే ఎదురవుతుందన్న తెలిపారు. ఈ హెచ్చరిక ప్రగతి భవన్ వేదికగా నేతల్లోకి వెళ్లింది. యాదాద్రి నర్సింహుడి త్రినేత్రం తరహాలోనే కేసీఆర్ సైతం తన మూడో కంటితో ఏ నాయకుడు ఏం చేస్తున్నారో, ఎవరెవరిని కలుస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో గమనిస్తూ గ్రహిస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాజకీయంగా చాలా మార్పులు జరిగే చాన్సులు ఉన్నాయని చెప్పారు. ఈ మాటలు పలికింది బాచుపల్లి శర్మ అయినా.. పలికించింది కేసీఆరే అనే చర్చలు ఇప్పటికే జోరందుకున్నాయి.
జాతీయ రాజకీయాల్లో కీలకంగా..
సీఎం కేసీఆర్‌కు గడ్డుకాలమంతా ఫిబ్రవరిలోనే వెళ్లిపోయిందని, రాహువు అంతర్దశ నుంచి బయటపడ్డారని బాచుపల్లి శర్మ తన పంచాంగ పఠనంలో పేర్కొన్నారు. గుహ నుంచి బయటకు వచ్చినట్లేనని, గతేడాది కంటే ఈసారి ఆయన జాతకం అద్భుతంగా ఉండబోతున్నదని నొక్కిచెప్పారు. ఆయనకు అనుకూల సమయం ప్రారంభమైందన్నారు. ప్రత్యర్థులు నిరంతరం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటారని, వాటికి ఏ మాత్రం సందు ఇవ్వకుండా వారినే ఆక్రమించి విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు. దేశమంతా ఆయనపైనే దృష్టి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గ్రహాల బలం ఆయనకు అనుకూలంగా ఉన్నందున విమర్శించేవారికి విశ్వరూపం చూపిస్తారని చెప్పారు.
సాహసోపేతమైన నిర్ణయాలు
పంచాంగం ప్రకారం ఈ ఏడాది రాష్ట్రానికి 75 శాతం మంచి ఫలితాలే ఉంటాయన్నారు. మిగిలిన 25 శాతం మాత్రం వ్యతిరేక ఫలితాలు ఉండబోతున్నట్టు తెలిపారు. తెలంగాణకు అంతా అభయమేనని వ్యాఖ్యానించారు. వాగ్ధాటి కలిగిన వ్యక్తులకు, మందీ మార్బలం ఉండే నేతలకు భాగ్యస్థానమే ఉందంటూ భరోసా ఇచ్చారు. గురు, శుక్రుల కలయిక రాజయోగాన్ని ఇస్తున్నదంటూ కేసీఆర్ గురించి ప్రస్తావించారు. పరిపాలనాపరంగా అద్భుతాలు జరగబోతున్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుందన్నారు. పరిపాలనా దక్షుడిగా కేసీఆర్ ఈ సంవత్సరం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు.
యజ్ఞయాగాదులూ ఎక్కువే
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజశ్యామల యాగం, వేర్వేరు సందర్భాల్లో చండీ మహాయాగం, సుదర్శన యాగం లాంటివి నిర్వహించిన కేసీఆర్.. ఈ ఏడాది కూడా అలాంటి యజ్ఞయాగాదులను ఎక్కువగానే నిర్వహిస్తారని పంచాంగ పఠనంలో బాచుపల్లి శర్మ పేర్కొన్నారు. వాటిని చేయాల్సిన అవసరమూ ఉన్నదన్నారు. ఈసారి మహారుద్ర యాగం చేస్తారంటూ వార్తలు కూడా ఇటీవల వినిపిస్తున్నాయి. ఈ ఏడాదే అది జరగొచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. లోక కల్యాణం కోసమే యాగాలు అని గతంలోనే సీఎం కేసీఆర్ తెలిపారు. మతం, సంప్రదాయాలు కూడా ముడిపడి ఉండడంతో బీజేపీని రాజకీయంగా ఎదుర్కోడానికి ఈ దిశగా కేసీఆర్ నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. 'నన్ను మించిన హిందువు ఎవరు' అనే మెసేజ్‌ను కేసీఆర్ మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లి బీజేపీ మతం సెంటిమెంట్‌కు ఫుల్‌స్టాప్ పెట్టొచ్చు.