గోదావరిఖనిలో ఉద్యోగాల పేరుతో దందా...! మాజీ కార్పొరేటర్, ఓ జర్నలిస్ట్ హస్తం..?

Update: 2022-02-28 08:49 GMT

దిశ, గోదావరిఖని: నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు దళారులు పుట్టుకొస్తున్నారు. ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు అందినకాడికి దండుకుంటున్నారు. తమకు ఉద్యోగం వస్తే కుటుంబ పోషణ భారం తగ్గుతుందని భావిస్తున్న నిరుద్యోగుల అవసరాలు దళారులకు లక్షల రూపాయలు కురిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 5వ ఇంక్లైన్ లో నివాసం ఉండే ఓ వ్యక్తి, మాజీ కార్పొరేటర్, జర్నలిస్ట్ పేరుతో చలామణి అవుతున్న మరో వ్యక్తితో కలిసి సుమారు 20 మంది వద్ద మెడికల్ సంబంధించిన వాటిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ. లక్ష నుంచి లక్ష 50 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం వస్తుందని ఎదురుచూశారు.

కానీ ఉద్యోగం రాకపోవడంతో బాధితులు తమ డబ్బులు కావాలని అడగడంతో వారిని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగాల పేరుతో సదరు వ్యక్తి తన ఇంటి చుట్టు తిప్పించుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సదరు 5వ ఇంక్లైన్ కు చెందిన వ్యక్తిని బాధితులు నిలదీసిన మరుక్షణమే వారికి ఓ మాజీ కార్పొరేటర్, ఓ జర్నలిస్టు కలిసి బెదిరింపులకు గురి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా ఇంకా ఎంత మంది దగ్గర ఇలా ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారని ప్రచారం జరుగుతుంది. అయితే వీరి ముగ్గురి మధ్య ఉన్న లావాదేవీలపై ప్రస్తుతం గోదావరిఖనిలో చర్చనీయాంశంగా మారుతోంది.

Tags:    

Similar News