భారత్‌లో ఈవీ, బ్యాటరీల తయారీ కోసం సుజుకి రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ - Japan's Suzuki Motor to invest Rs 10,440 cr for manufacturing EVs in India
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్ భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ), బ్యాటరీల తయారీ కోసం భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించింది. దీనికోసం కంపెనీ రూ. 10,440 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. 2025 నాటికి ఈవీల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు రూ. 3,100 కోట్లను, 2026 నాటికి ఈవీలకు అవసరమైన బ్యాటరీల ఉత్పత్తి కోసం ప్లాంట్ ఏర్పాటుకు రూ. 7,300 కోట్లను పెట్టుబడిగా నిర్ణయించామని కంపెనీ వెల్లడించింది.
మిగిలిన మొత్తాన్ని 2025 సమయానికి మారుతీ సుజుకి టొయోట్సు ద్వారా వాహనాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఉపయోగించనున్నట్టు కంపెనీ పేర్కొంది. భారత్ స్వయం సమృద్ధి లక్ష్యానికి తోడ్పాటును అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సుజుకి మోటార్ డైరెక్టర్ తొషి హిరో సుజుకి చెప్పారు. ఈ పెట్టుబడుల ద్వారా చిన్న కార్లతో కార్బన్ రహిత లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి సుజుకి మోటార్‌కు ఉన్న రెండు తయారీ ప్లాంట్ల నుంచి ఏడాది నుంచి 22 లక్షల వరకు వాహనాలను ఉత్పత్తి చేస్తున్నామని, ఇవి కాకుండా అదనంగా మరో 7.5 లక్షల వాహనాల తయారీ సామర్థ్యం అందుబాటులో ఉందని కంపెనీ వివరించింది.