పోలీస్ బాస్.. ఇది కాదా ఉల్లంఘన?

చట్టం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీలకు మారుపేరుగా, సమాజానికి రోల్ మోడల్ గా నిలవాల్సిన సిటీ పోలీసుల పరిస్థితి కంచె చేను మేసినట్టు తయారైంది.

Update: 2022-04-01 00:30 GMT

దిశ, సిటీ బ్యూరో: చట్టం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీలకు మారుపేరుగా, సమాజానికి రోల్ మోడల్ గా నిలవాల్సిన సిటీ పోలీసుల పరిస్థితి కంచె చేను మేసినట్టు తయారైంది. సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట ఈజీ డ్యూటీ, ఈ చలానాలకు అలవాటు పడి విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో జవాబుదారితనం తగ్గుతుంది. చట్టాలను ఉల్లంఘించటంలోనూ తమకు మించినవారెవ్వరంటూ సత్తా చాటుకుంటున్నారు. చట్టాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసులు డిపార్ట్ మెంట్ వాహనాలతో పాటు తమ సొంత వాహనాలను కూడా నగరంలో నిత్యం బిజీగా ఉండే మెయిన్ రోడ్లపై ఎక్కడబడితే అక్కడ రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారు. అదే కామన్ మ్యాన్ సిగ్నల్ వద్ద వైట్ లైన్ దాటినా, హెల్మెట్ ధరించకపోయినా ఈ చలానా ఇంటికొస్తుంది.

మహానగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి చట్టాల్ని సక్రమంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లలో మెజార్టీ పోలీస్ స్టేషన్లకు పార్కింగ్ వసతే లేదు. అంతెందుకు.. పీఎస్ మొదలుకుని సీసీఎస్( సెంట్రల్ క్రైం స్టేషన్) భవనానికి కూడా పార్కింగ్ వసతి లేకపోవటంతో సీసీఎస్ నుంచి మొదలుకుని నిజాం కాలేజీ హాస్టల్ గేటు వరకు, కొన్ని సందర్భాల్లో ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ గేటు వరకు కూడా వందలాది వాహనాలను రోడ్డుపై అక్రమంగా పార్కింగ్ చేస్తూ, ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించటమే గాక, ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసులు అక్రమ పార్కింగ్ లో నిలిపిన ఈ వాహనాలకు జరిమానాలు విధించటం లేదు. ఇదెక్కడి న్యాయమంటూ కామన్ మ్యాన్, ద్వి చక్ర వాహనదారులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

సీసీఎస్‌కు, డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న ఇతర రాష్ట్రానికి చెందిన ఓ హోటల్ నిర్వాహకులు జీహెచ్ఎంసీ పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుత్ పాత్‌ను ఏకంగా హోటల్ పార్కింగ్ స్థలంగా వినియోగిస్తున్నారు. రోజూ మధ్యాహ్నాం ఆ హోటల్ కు వందల సంఖ్యలో జీహెచ్ఎంసీ, పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు భోజనం కోసం వస్తుంటారు. హోటల్ నిర్వాహకులు ఏకంగా ఫుట్ పాత్ ను పార్కింగ్ స్థలంగా వాడుకుంటున్నా, కనీసం ట్రాఫిక్ పోలీసులు గానీ, దాన్ని ఫుత్ పాత్‌గా అభివృద్ధి చేసిన జీహెచ్ఎంసీ అధికారులు గానీ ప్రశ్నించకపోవటం చర్చనీయాంశమైంది. తినేందుకు వచ్చి తమ పనైపోయిందనుకుని వెళ్లిపోతున్నారే తప్పా, ఏ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహారించి, ప్రశ్నించిన పాపాన పోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

షాపింగ్...స్టాపింగ్

నగరంలో పోలీసుల వాహనాలను ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేస్తూ, సాధారణ వాహనదారులకు ఇబ్బందులను సృష్టిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పోలీసు శాఖలోని పలువురు ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులు షాపింగ్ కోసం వచ్చి, నేరుగా దుకాణం ఎంట్రెన్స్ ముందు వాహనాన్ని స్టాప్ చేయటంతో పాటు వాటి పక్క నుంచి వెళ్లే వాహనదారులపై తమ ఓవర్ యాక్షన్ ను ప్రదర్శిస్తుంటారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక్క పోలీస్ శాఖనే గాక, ఇతర విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల పరిస్థితి కూడా ఇలాగే తయారైందనేది నగరవాసులు మాట.

చెప్పేది వారే... అయినా చెప్పకోరూ

మహానగరంలో రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ రోడ్లు విస్తరించాలి, ఎక్కడెక్కడ ప్రమాదాల నివారణ కోసం సైనేజీలు ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ జంక్షన్లను మెరుగుపర్చాలి, ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు కేటాయించాలన్న విషయాలను జీహెచ్ఎంసీ అధికారులకు సూచించేది ట్రాఫిక్ పోలీసులే. కానీ వీరు తాము విధులు నిర్వహిస్తున్న పీఎస్ ల వద్ద, సీసీఎస్‌కు ప్రతి రోజు వివిధ పనుల మీదు రాకపోకలు సాగించే వందలాది మంది సౌకర్యార్థం ఇక్కడ పార్కింగ్ వసతిని ఏర్పాటు చేసుకోవటంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా పోలీసుల తీరు మారుతుందో.. లేదో చూడాలి.

Tags:    

Similar News