మూసపద్ధతులను 'ఫుట్‌బాల్'తో తన్నిన.. అక్కాచెల్లెళ్ల ఇన్‌స్పిరేషనల్ స్టోరీ!
దిశ, ఫీచర్స్: ఒడిశా, కంధమాల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామమే ‘జిరిడికియా’. పెద్దగా లోకానికి పట్టని ఆ గ్రామంలో ఆడపిల్లలకు ‘బాల్య వివాహం’ చేసి, తమ బాధ్యత తీర్చుకుంటారు తల్లిదండ్రులు..Latest Telugu News
దిశ, ఫీచర్స్: ఒడిశా, కంధమాల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామమే 'జిరిడికియా'. పెద్దగా లోకానికి పట్టని ఆ గ్రామంలో ఆడపిల్లలకు 'బాల్య వివాహం' చేసి, తమ బాధ్యత తీర్చుకుంటారు తల్లిదండ్రులు. కానీ ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆ పల్లె స్వరూపాన్ని, అక్కడి ఆడపిల్లల బతుకుల్ని మార్చేసి రాష్ట్రాస్థాయిలో తమ పల్లెపేరు మారుమ్రోగేలా చేస్తున్నారు. బాల్యవివాహాలను నిరోధించడం సహా అమ్మాయిలు సైతం పైచదువులు చదివేందుకు కారణమయ్యారు. అంతేకాదు ఈ చిన్న ఊరు నుంచే ఓ ఫుట్‌బాల్ జట్టును తయారుచేశారు ఆ సిస్టర్స్. అక్కడి ఆడపిల్లలకు ఎవరి సహకారం లేని స్థాయి నుంచి అందరూ తమకు మద్దతిచ్చే స్థితికి చేరారంటే దానికి కారణం షర్మిలత ప్రధాన్, జ్యమునలే కారణం. ఏదేమైనా దేశం గర్వించదగ్గ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదగాలని ఆకాంక్షిస్తున్న షర్మిలత, భవిష్యత్తులో పోలీస్ అధికారిగా సేవలందించాలని కలలు కంటోంది. మరి ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ల జర్నీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
జ్యమున, షర్మిలత ఇద్దరూ ఒడిశాలోని కందా ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్(PTG)కు చెందినవారు. సాగు పనితో పాటు కూలీ పనుల మీద ఆధారపడి జీవించే కుటుంబం వారిది. వీరికి ఓ తమ్ముడు, చెల్లి కూడా ఉండగా.. జ్యమున పదో తరగతితో చదువు ఆపేయాల్సి వచ్చింది. ఇతర ముగ్గురు పిల్లల్ని చదివించేందుకు ఆ కుటుంబానికి స్థోమత లేకపోవడమే కారణం కాగా.. జ్యమున తల్లిదండ్రులకు సాయం చేసేందుకు వారితో కలిసి పనికి వెళ్లేది. ఇక ఎకనామిక్స్, ఆంత్రోపాలజీ చదువుతున్న 19 ఏళ్ల షర్మిలత తన గ్రామంలో హైస్కూల్ గ్రాడ్యుయేట్ చేసిన మొదటి వ్యక్తి కాగా.. తను కూడా తమ తోబుట్టువుల చదువు కోసం అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. ఇదే సమయంలో జ్యమునకు పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిశ్చయించుకోగా, తనకు ఆసక్తి లేదని జ్యమున ప్రతిఘటించింది. సరిగ్గా అప్పుడే ఆ గ్రామంలో 'సేవ్ ది చిల్డ్రన్' నిర్వహించిన 'లైఫ్ స్కిల్ ట్రైనింగ్' అండ్ 'రిప్రొడక్టివ్ & సెక్సువల్ హెల్త్'పై వర్క్‌షాప్‌కు ఆమె హాజరైంది. దాని తర్వాత బాల్య వివాహాల వల్ల కలిగే హాని గురించి గ్రామస్తులకు ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టింది. వర్క్‌షాప్ సమయంలోనే అబ్బాయిలు, అమ్మాయిల మధ్య సమానత్వం గురించి నేర్చుకున్న ఆమె.. బాల్య వివాహం తప్పని తల్లిదండ్రుల్ని ఒప్పించేందుకు మూడేళ్లు పట్టిందిని తెలిపింది.
ఫుట్‌బాల్ దిశగా..
గ్రామంలోని అబ్బాయిలు ఫుట్‌బాల్ ఆడటం చూసిన జ్యమున వారితో ఆడాలనుకుంది. కానీ ఆమె కుటుంబం సహా మొత్తం సమాజం నుంచి ప్రతిఘటన ఎదురైంది. అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడకూడదంటూ వాళ్ల అన్న సైతం తనను వెక్కిరించేవాడు. 'నువ్వు వంట నేర్చుకుంటే బాగుంటుంది. నీకు వంట బాగా తెలిస్తే అత్తమామలు మెచ్చుకుంటారు' అంటూ షర్మిలతను కూడా గేలి చేశాడు. దీంతో అబ్బాయిలతో ఆడటం వల్ల దుర్భాషలాడుతారని భావించిన ఆ ఇద్దరు.. పొలంలో ఒక ప్రాంతాన్ని చదును చేసి, అబ్బాయిల ఆటతీరును చూసి గేమ్ నేర్చుకుంటూ చుడీదార్లలో షూ లేకుండానే పాదాలతో ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించారు. వీరి ఆసక్తి, పట్టుదలను గమనించిన జిల్లా స్థాయిలో ఫుట్‌బాల్ ఆడే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించాడు. జ్యమున తండ్రి కూడా సమయం దొరికినప్పుడల్లా వారికి మార్గనిర్దేశం చేసేవాడు. ఈ క్రమంలోనే 'సేవ్ ది చిల్డ్రన్' సాయంతో వాళ్లకి యూనిఫామ్స్ కూడా రావడంతో మరింత మంది ఫుట్‌బాల్ జట్టులో జాయిన్ అయ్యారు. అయితే ఆ డ్రెస్సులను చూసి కొందరు అబ్బాయిలు తీవ్రంగా కామెంట్స్ చేసినా పట్టించుకోక తమ లక్ష్యంపైనే దృష్టి సారించడం విశేషం.
రాష్ట్రస్థాయిలో:
జట్టుగా సమిష్టిగా రాణిస్తూ అనేక ఇంటర్-పంచాయత్ మ్యాచ్‌లను గెలిచిన ఈ అమ్మాయిల జట్టు, అంతర్ జిల్లాల మ్యాచ్‌లలో రెండో స్థానంలో నిలిచారు. మార్చిలో జరిగిన 'సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్' ఇంటర్-జిల్లా మ్యాచ్‌లో కప్పు గెలిచారు. అంతేకాదు తమ గ్రామానికి చెందిన అంబికా ప్రధాన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచ్‌లకు రిఫరీగా ఎంపిక కాగా పురుషుల మ్యాచ్‌లలో సైడ్ రిఫరీగా కూడా స్థానం దక్కించుకుంది. 'ఏడాది ప్రారంభంలో కంధమాల్‌లో జరిగిన 19 రోజుల శిబిరానికి హాజరయ్యాము. అక్కడ మేము స్పోర్ట్స్ హాస్టల్, మెరుగైన శిక్షణా సౌకర్యాల కోసం మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాం. కానీ ఇంకా ఎవరూ దీనిపై స్పందించలేదు. గ్రామంలో 13 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్సున్న 20 మంది బాలికలు ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆడుతున్నారు. మేము సాధిస్తున్న విజయం ఇతరులకు స్ఫూర్తినిస్తుండగా, రెండు పొరుగు గ్రామాల నుంచి 19 మంది బాలికలు శిక్షణ కోసం జిరిడికియాకు వస్తున్నారు' అని షర్మిలత పేర్కొంది.
మార్పు:
అక్కాచెల్లెళ్లు గ్రామంలోనే కాదు మైదానం వెలుపల కూడా మార్పు తీసుకొచ్చారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించడం నుంచి శానిటరీ నాప్‌కిన్‌ల వినియోగం, ఇతర సురక్షితమైన రుతుక్రమ పద్ధతులను ప్రోత్సహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. చిన్న సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ ప్రదర్శనలు బాగా ప్రాచుర్యం పొందడంతో ఇతర గ్రామాల నుంచి కూడా ప్రజలు వీటిని చూసేందుకు రావడం సహా డబ్బు కూడా చెల్లిస్తున్నారు. దీంతో ఆ వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని గ్రామ అభివృద్ధికి, మిగిలినవి ఫుట్‌బాల్ పరికరాలను పొందడానికి ఉపయోగిస్తున్నారు. ఐదేళ్లుగా ఆ గ్రామంలో ఒక్క బాల్యవివాహం కూడా జరగలేదంటే దానికి ఆ ఆడపిల్లల కృషే కారణం. దీంతో ప్రస్తుతం పల్లెటూరి ఆడపిల్లలంటే ప్రజలు గర్వపడుతున్నారు. దీనికి ముందు అమ్మాయిల్ని ఎక్కడికీ వెళ్లనిచ్చేవాళ్లు కాదు కానీ ఈరోజు ఫుట్ బాల్ ఆడేందుకు అనుమతిస్తుండటంతో జిల్లాలు దాటుతూ కీర్తిపతాక ఎగరేస్తున్నారు.
'ఫుట్‌బాల్ ఆడితే నాకు మంచి భర్త దొరకడని నాకు తరచుగా చెప్పేవారు. ఆ మాటలతో వాళ్లు నా సెల్ఫ్ రెస్పెక్ట్‌ను తగ్గించారు. నా అభిరుచిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ నేను ఆడటం ఆపలేదు. సేవ్ ది చిల్డ్రన్ (బాల రక్షా భారత్) బృందం సకాలంలో వచ్చింది. వారి కార్యక్రమంలో భాగంగా, మా కలలు, కోరికలను వ్యక్తీకరించడానికి మాకో వేదికలా ఉపయోగపడింది. సేవ్ ది చిల్డ్రన్ నా గొంతు పెంచడానికి మరియు నా హక్కుల కోసం పోరాడటానికి నాకు శక్తినిచ్చింది. నా చెల్లెలు, నేనుత జాతీయ స్థాయిలో ఆడాలనే కలను చంపుకోవడం నాకు ఇష్టం లేదు'
- జ్యమున